పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయాలు

ప్రతిభ పాఠశాలలో అమ్మకాలు చేస్తున్న పుస్తకాలను పరిశీలిస్తున్న విద్యాశాఖ అధికారులు, విద్యార్థి సంఘం నాయకులు

      అనంతపురం కలెక్టరేట్‌ : విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యామాఫియాను ప్రారంభించాయి. నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంను పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు. దీనిని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తున్న నగరంలోని ప్రతిభ ప్రయివేటు పాఠశాల వద్ద గురువారం ఉదయం ధర్నా నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల వ్యవహరిస్తున్న తీరును జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన డిప్యూటీ డిఇఒ శ్రీనివాస రావు పాఠశాలకు చేరుకుని పరిశీలన చేశారు. పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తున్న గదికి తాళం వేసి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమణయ్య మాట్లాడుతూ జిల్లాలో ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని చెప్పారు. పాఠశాలలను పుస్తకాలు, బట్టల షాపుల్లా మార్చేస్తున్నారన్నారు.కొన్ని పాఠశాలలో 50 శాతం ఫీజు చెల్లిస్తేనే పైతరగతిలకు అనుమతిస్తామని తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు భాష్యం, నారాయణ, చైతన్య, కేశవరెడ్డి తదితర కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలల్లో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్‌ పట్టణ కార్యదర్శి మంజు, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు భీమేష్‌, వంశీ, సిద్ధు పాల్గొన్నారు.

➡️