హత్యకేసు నిందితుడు టిడిపి అభ్యర్థి

హత్యకేసు నిందితుడు టిడిపి అభ్యర్థి

ఎద్దుల బండిపై ప్రచారం చేస్తున్న అనంత వెంకటరామిరెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం

అనంతపురం అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి హత్యకేసులో నిందితుడని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. బుధవారం నగరంలోని 23వ డివిజన్‌లో వైసిపి ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డికి గజమాలలు, కీలుగుర్రాలతో స్వాగతం పలికారు. మరోవైపు ఎద్దుల బండిపై అనంత నిలబడి ఫ్యాన్‌ గుర్తును చూపిస్తూ ముందుకు సాగారు. అంతేగాకుండా వైసిపి అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ టిడిపి అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి ప్రసాద్‌ వ్యక్తి హత్యకేసులో నిందితుడని ఆరోపించారు. ప్రశాంతతకు మారుపేరైన అనంతపురంలో టిడిపి నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే రూరల్‌ పంచాయతీలో నగేష్‌ను హత్య చేయడానికి ప్రయత్నించారన్నారు. కళ్లల్లో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేయడం బాధాకరమన్నారు. జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టిడిపి నాయకులు భయపడుతున్నారన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌, డీఐజీ, కలెక్టర్‌, ఎస్పీలను కోరారు. కాగా ఈ ఎన్నికలు జగన్‌ విశ్వసనీయతకు, చంద్రబాబు మోసానికి మధ్య జరుగుతున్నాయన్నారు. 2014లో ఇదే చంద్రబాబు, బిజెపి, జనసేన కలిసి హామీలు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేశారన్నారు. అదే వైసిపి అధినేత జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేశారన్నారు. ప్రస్తుతం ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలన్నింటికి కూడా అమలు చేస్తారన్నారు. ముఖ్యంగా అమ్మఒడి పథకాన్ని రూ.17వేలు, రైతు భరోసాను రూ.16 వేలకు పెంచారన్నారు. అలాగే నవరత్నాలన్నీ మెరుగైన రీతిలో ఇంటింటికీ అందజేస్తామన్నారు. కాగా అనంతపురంలో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో కూటమి నాయకుల మాటలు నమ్మకండా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

➡️