కౌంటింగ్‌కు సన్నద్ధంగా ఉన్నాం..! : కలెక్టర్‌

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : జూన్‌ 4వ తేదీన జిల్లాలో చేపట్టనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని సన్నద్ధంగా ఉన్నామనికలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్‌ కుమార్‌ తెలియజేశారు. ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి గురువారం సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని విసి హాల్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా కౌంటింగ్‌ కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల వద్ద సిఎపిఎఫ్‌, ఎస్‌ఎపి, సివిల్‌ బలగాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో కౌంటింగ్‌ ప్రక్రియను ప్రశాంతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రిటర్నింగ్‌ అధికారులు రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, వెన్నెల శ్రీను, జి.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️