మున్సిపల్ కార్యాలయం ముట్టడి.. అరెస్టు, విడుదల

Jan 6,2024 15:36 #Annamayya district
municipal workers strike 12th day protest annam
  • కార్మికులను బలవంతంగా బయటకు నెట్టిన పోలీసులు
  • సిఐటియు జిల్లా అధ్యక్షులు అరెస్టు, విడుదల

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా 11వ రోజు శనివారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పురపాలక కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కూర్చుని తమకు న్యాయం చేయాలని బిగ్గరగా నినాదాలు చేశారు. పట్టణ ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పోలీసులు, స్పెషల్ ఫోర్స్ తో మునిసిపల్ కార్మికులను బలవంతంగా బయటకు తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులకు కార్మికులకు మధ్య కొంతసేపు తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పోలీసు బలగాలు కార్మికులను బలవంతంగా బయటకు లాక్కొని వెళ్లారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ను వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకొని వాహనానికి అడ్డంగా నిలబడ్డారు. కార్మికులను ముందుకు రానివ్వకుండా గేటుకు తాళాలు వేసి పోలీసులు రవికుమార్ను తమ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మికులంతా ఏకమై నినాదాలు చేసుకుంటూ పొరపాలక కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లడంతో రవికుమార్ ను వెంటనే విడుదల చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాలని తమ న్యాయమైన డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకుండా న్యాయబద్ధంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై పోలీసులతో ఉద్యమాన్ని ఆపాలని చూడడం సరికాదని అన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె ఆగదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ ఓబయ్య, నాయకురాలు లక్ష్మీదేవి, కార్మికులు రమణ, ప్రసాద్, రెడ్డయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

➡️