ఆసరా కాదు.. టోకరా..

Jan 24,2024 15:41 #Annamayya district
tdp ledar on ysr asara scheme

డ్వాక్రా ఋణ మాఫీ జగన్నాటకమే
— బత్యాల

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : నోరు తెరిస్తే అక్క చెల్లెమ్మలంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పే జగన్ రెడ్డి ఆచరణలో నిట్టనిలువునా. మోసం చేస్తున్నాడని జీతాలు పెంచమని వేడుకున్న అంగన్వాడీలపై కక్ష కట్టి ఉక్కుపాదం మోపిన జగన్ రెడ్డి ఆసరా కింద మహిళలను ఉద్దరిస్తాననడం సిగ్గుమాలిన చర్య అని., అది అసలు ఆసరానే కాదని., అక్క చెల్లెమ్మలకు టోకరా అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి బత్యాల చెంగలరాయుడు అన్నారు. బుధవారం బత్యాల భవన్ లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో దినదిన ప్రవర్ధమానంగా వెలిగిన డ్వాక్రా వ్యవస్థను కూకటివేళ్లతో తెకలిస్తున్న జగన్ రెడ్డి ఆసరా పేరుతో తానేదో పొదుపు సంఘాలను ఉద్ధరించేస్తున్నట్లు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు. చంద్రబాబు హయాంలో పొదుపు మహిళలకు సున్నా వడ్డీ రూ 5 లక్షల వరకు వర్తింప చేస్తే, తాను అధికారంలోకి వస్తే పది లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి జగన్ రెడ్డి మాట తప్పి రూ 3 లక్షలకు కుదించి మహిళలను మోసం చేశారని ఆరోపించారు. ఆ మూడు లక్షలకు కూడా సున్నా వడ్డీ కేంద్రమే భరిస్తూ ఉందని వివరించారు. భవిష్యత్తులో అవసరాలకు మహిళలు దాచుకున్న అభయహస్తం నిధులను దారి మళ్ళించడమే మహిళా సంక్షేమమా అని ప్రశ్నించారు. 45 ఏళ్లకే పెన్షన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసి చేయూత అంటూ దగా చేశాడని తెలిపారు. జగన్ రెడ్డి మహిళా ద్రోహి అని.. మద్య నిషేధమని మహిళల ఓట్లు వేయించుకొని, పిచ్చి మధ్యంతో మాంగల్యాలు తెంచడమే మహిళోద్దారణ అని ప్రశ్నించారు. డ్వాక్రా ను నిర్వీర్యం చేశారని, శ్రీనిధి, ఉన్నతి రద్దు చేశారని అన్నారు. ఎన్టీఆర్ బేబీ కిట్లు, తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్, దీపం పథకాలు నాశనం చేశారని, బాలింతలకు రూ 5 వేలు నిలిపివేశాడని, పెళ్ళికానుక పథకాన్ని రద్దు చేశాడని, కళ్యాణ మిత్రులను రోడ్డున పడేశాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని గంజాయి, మాదకద్రవ్యాలకు అడ్డంగా మార్చారని అన్నారు. యువతిపై అత్యాచారం చేసి రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే ఇంతవరకు బాధ్యులను పట్టుకోలేదని, కేంద్ర నివేదిక ప్రకారం ఐదేళ్లలో రెండు లక్షలకు పైగా నేరాలు జరిగాయని, ఏ కేసులోనూ సరైన చర్యలు లేవని., ఇదేనా మహిళా ఉద్దరణ అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️