రేపటి పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

May 11,2024 23:52

మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎస్పీ
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం 7 గంటల నుండి ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగేలా పకద్భందీ చర్యలు తీసుకున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికలాధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం కలక్టరేట్‌లోని మీడియా సెంటర్‌లో ఎస్సీ తుషార్‌ దూడితో కలసి కలెక్టర్‌ మీడియాతో పోలింగ్‌ ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల ప్రచారం 6 గంటలకు ముగిసిందని, మద్యం షాపులను మూయించడంతో పాటు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇకపై ప్రచారాలేమీ నిర్వహించకూడదన్నారు. గుంటూరు జిల్లాలో 17,91,543 మంది ఓటర్లున్నారని, వీరికోసం 1,915 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి 30 మంది అభ్యర్థులు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి 2,300 మంది పీవోలు, 2,300 మంది ఏపీవోలు, 9,800 మంది ఓపీవోలను నియమంచామన్నారు. పోలింగ్‌ అధికారులకు ఆదివారం సంబంధిత నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో కేటాయించి పోలింగ్‌ స్టేషన్‌ ఉత్తర్వులను అందిస్తారన్నారు. జిల్లాలో 1,915 పోలింగ్‌ కేంద్రాల్లో 372 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయని, 1,498 పోలింగ్‌ కేంద్రాల్లో (78 శాతం) వెబ్‌కాస్టింగ్‌ చేస్తామని వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 487 మందిని మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణకు 176 మందిని సెక్టోర్‌ ఆఫీసర్లుగా నియమించారన్నారు. పోలింగ్‌ కేంద్రాల లోపల, క్యూ లైన్లకు మూడు వేల సీసీ కెమెరాలతో పాటు 187 మంది వీడియోగ్రాఫర్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు.పోలింగ్‌ విధులు కేటాయించిన సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు తాడికొండ నియోజకవర్గంకు గుంటూరు జెకెసి కాలేజీ, మంగళగిరి నియోజకవర్గానికి మంగళగిరి ఆత్మకూరులోని నిర్మలా హై స్కూల్‌ , పొన్నూరు నియోజకవర్గంకు పొన్నూరు పట్టణం నిదుబ్రోలులోని సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్‌ , తెనాలి నియోజకవర్గానికి తెనాలిలోని జెఎంజె గ్లోబల్‌ స్కూల్‌, ప్రత్తిపాడు నియోజకవర్గానికి గుంటూరు టీజెపిఎస్‌ కాలేజీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి గుంటూరు లాడ్జి సెంటర్‌లోని ఏఎల్‌ బి.ఈడి కాలేజీ, గుంటూరు తూర్పు నియోజకవర్గంకు సాంబశివరావుపేటలోని ఏసీ కాలేజీకి ఆదివారం ఉదయం 7 గంటలకు వెళ్లి ఎన్నికల సామాగ్రి, ఈవియంలు తీసుకొని ఏర్పాటు చేసిన బస్సుల్లో వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పోలింగ్‌ సామగ్రి తీసుకువెళుతున్న వాహనాలకు, సెక్టోరల్‌ అధికారుల వాహనాలకు బందోబస్తుకు వచ్చే పోలీసు వాహనాలకు జిపిఎస్‌ పరికరాలను ఏర్పాటు చేశామని, కలక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నుండి, రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయం నుండి పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. పోలింగ్‌ రోజు అభ్యర్థులు తిరగడానికి ఒక వాహనం, వారి ఏజెంట్‌కు ఒక వాహనం, కార్యకర్తలకు ఒక వాహనం మొత్తం మూడు వాహనాలకు అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి వాహనంలో ఐదుగురుకి మించి ప్రయాణించడానికి వీల్లేదని, అభ్యర్థికి అనుమతించిన వాహనాన్ని ఇతరులు వినియోగించరాదని స్పష్టం చేశారు. పోలింగ్‌ సమయానికి 48 గంటల ముందు నుండి అభ్యర్థులు ఓటర్లను ప్రభావితపరిచేలా సమావేశాలు, ర్యాలీలు, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ కాల్స్‌ చేయరాదన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను కలక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 0863-2234301కు తెలపొచ్చని చెప్పారు. సివిజిల్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులు 98 శాతం పరిష్కరించామన్నారు. ఎన్నికల రోజు కలక్టరేట్‌లో కమ్యూనికేషన్‌, మీడియా మానిటరింగ్‌ కంట్రోల్‌ రూమ్‌, వెబ్‌కాస్టింగ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతరం పోలింగ్‌ జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తామని చెప్పారు. మీడియాలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 20 శాతం అదనంగా అవసరమైన ఈవిఎంలను కమీషనింగ్‌ చేసి సిద్ధం చేశామని, పోలింగ్‌ కేంద్రాల్లో ఈవిఎంల సమస్యలు ఉత్పన్నమైతే 15 నిమిషాల్లోగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకొని పరిష్కరించేలా సెక్టరల్‌ అధికారులతో పాటు సాంకేతిక సిబ్బందిని అన్ని మండలాల్లోనూ అందుబాటులో ఉంచామని వివరించారు. జిల్లాకు బిఈఎల్‌ కంపెనీ నుండి 21 మంది ఈవిఎం ఇంజినీర్లు వచ్చారని, నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున కేటాయించామని తెలిపారు.జిల్లాలో హోం ఓటింగ్‌కు 2,348 మంది దరఖాస్తు చేసుకోగా 2,292 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. 20,397 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. పోలింగ్‌ రోజు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు తెలిపారు. పౌరుల ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా యాజమాన్యాలు సెలవు ప్రకటించకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటర్లంతా ఓటేయాలని, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం అనుమతించిన ఇతర గుర్తింపు కార్డులు పాస్‌ పోర్ట్‌ , డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు , పాన్‌ కార్డు తదితర 12 రకాల గుర్తింపు కార్డులతో ఏదో ఒకటి తీసుకొని వెళ్లాలని సూచించారు. ఇప్పటికే ఓటరు స్లీప్‌ల పంపిణీ పూర్తి అయిందని, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, వేసవి ఎండల దృష్ట్యా నీడ కోసం షామియానాలు, తాగునీరు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వికలాంగులు, వృద్ధుల కోసం వీల్‌చైర్స్‌, కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు.ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు దాదాపు నాలుగు వేల మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీరిలో 11 కంపెనీల సిఎపిఎఫ్‌ , ఎస్‌ఎపి సిబ్బంది వున్నారన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రతతో పాటు, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్సెస్‌, పికెట్స్‌, చెక్‌ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఇప్పటికే మద్యం షాపులన్నీ మూయించామని, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఓటు లేని ఇతర ప్రాంతాల వ్యక్తులు ఉండకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

➡️