కొటియాలో ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు

Apr 10,2024 21:48

 కొరాపుట్‌ జిల్లా అధికారులు అంగీకారం

ప్రజాశక్తి-సాలూరు  : వివాదాస్పద కొటియా గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఇఆర్‌ఒ, ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌ చెప్పారు. బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన సెక్టార్‌ అధికారుల, బూత్‌ స్థాయి అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొటియా గ్రామాల్లో ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొరాపుట్‌ జిల్లా అధికారులు అంగీకరించారని తెలిపారు. ఈ మేరకు రెండు జిల్లాల అధికారుల మధ్య అంగీకారం కుదిరిందని చెప్పారు. దీనిపై బూత్‌ స్థాయి అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి సెక్టార్‌ అధికారి తన పరిధిలో పోలింగ్‌ కేంద్రాలు, రూట్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలు, ఇతర అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని స్పష్టంచేశారు. సమాచారం వేగంగా అందించుటకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రతి సెక్టార్‌ అధికారి ముందుగానే పరిశీలన చేయాలని ఆదేశించారు. 12, 13, 15 తేదీల్లో నిర్వహించే ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల శిక్షణ కేంద్రం – ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం దండిగాం చెక్‌ పోస్టును తనిఖీ చేశారు. సమావేశంలో నాలుగు మండలాల తహశీల్దార్లు, పాల్గొన్నారు.

➡️