గిద్దలూరు అభివృద్ధిలో అశోక్‌రెడ్డి కృషి

ప్రజాశక్తి-గిద్దలూరు గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి అశోక్‌రెడ్డి కృషితోనే సాధ్యమైందని ముత్తుముల అశోక్‌రెడ్డి సతీమణి ముత్తుముల పుష్పలీల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులో మూడు కొళాయిల వీధి, షాజ్‌ బజారు, పూసల బజారు, మోహన్‌ నగర్‌లలో ఇంటింటికీ తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే మహాశక్తి పథకం ద్వారా మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి నెల రూ.1,500, తల్లికి వందనం ద్వారా ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి యేటా రూ.15 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యేటా ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో, స్థానికంగా నివాసం ఉండే ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు బిల్లా రమేష్‌, పట్టణ టీడీపీ కౌన్సిలర్లు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️