గుర్తు తెలియ వాహనం డీ కొని వ్యక్తి మృతి

Feb 4,2024 22:21

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని గొరిగిపూడి గ్రామం వద్ద కరకట్టపై ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కొల్లూరు మండలం జోలపాలెం పంచాయతీలోని గుంటూరు గూడెం గ్రామానికి చెందిన గురిందపల్లి స్వామియేలు (38) అనే వ్యక్తి వ్యవసాయ కూలి పని చేసుకునే యువకుడు. శనివారం సాయంత్రం తన ద్విచక్ర వాహనాన్ని రిపేర్ చేయించుకునేందుకు రేపల్లె వెళ్లాడు. రిపేరు పూర్తి చేసుకుని సాయంత్రం సుమారు 6గంటల సమయంలో తిరిగి స్వగ్రామంకు వస్తుండగా ఓలేరు వద్దకు రాగానే వంతెనపై నుండి కరకట్టవైపుగా గోరిగపూడి సమీపానికి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని ఎవ్వరూ గుర్తించలేదు. ఆదివారం ఉదయం వరకు పడిన చోటే ఉండిపోయాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తున్నప్పటికీ ఫోను రింగ్ అవుతుంది తప్ప ఫోన్ ఎత్తకపోవడంతో కంగారుపడ్డారు. ఉదయం 6గంటల సమయంలో ఫోను రింగ్ అవుతుండగా అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు ఫోన్ రింగు కావటాన్ని గమనించి చూడగా వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించి రింగ్ అవుతున్న ఫోన్‌ను లిఫ్ట్ చేసి సమాచారం కుటుంబ సభ్యులకు అందించారు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే కొనఊపిరితో ఉన్న యువకున్ని 108వాహనం ద్వారా తెనాలి వైద్యశాలకు తరలిస్తుండగా వెల్లటూరు సమీపనికి రాగానే మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. దీంతో మృతదేహాన్ని వెల్లటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులకు సమాచారం అందించగా హెడ్ కానిస్టేబుల్ ఎస్ నాగరాజు పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్య స్వరూప రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాగరాజు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు, కొల్లూరు మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. మృతుల కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ, పలువురు టిడిపి నాయకులు ఉన్నారు.

➡️