బస్సులన్నీ సిద్దం సభకు – అవస్థల్లో ప్రయాణికులు

Mar 11,2024 00:08

– సిద్ధం సభకు శ్రీకాకుళం, విశాఖపట్నం నుండి ఆర్టీసీ బస్సులు
– బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు
– ఆటోలను ఆశ్రయించిన ప్రయాణికులు
ప్రజాశక్తి – బాపట్ల
సీఎం వైఎస్‌ జగన్ వైసీపీ చిట్ట చివరి సిద్ధం సభ జిల్లాలోని మేదరమెట్లలో అట్టహాసంగా ఏర్పాటు చేశారు. సభకు కార్యకర్తలను తరలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలనుండి బస్సులను తరలించారు. బస్సులనీ సిద్దం సభకు వెళ్లడంతో బస్టాండ్లలో బస్సులు కరువయ్యాయి. రోజువారీ ప్రయాణికులు బస్సులకోసం అవస్థలు పడ్డారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణం తప్పని ప్రజలు ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆటోల్లో ప్రమాదకర ప్రయాణం చేయడంతోపాటు అధిక ఛార్జీలు భరించాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులతోపాటు ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో అద్దంకి వైపు మళ్లించడంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే పాతబస్టాండులో బస్సులు లేకపోవడంతో బోసిపోయి కనిపించింది.
ఎంఎల్‌ఎ రఘుపతి ఆధ్వర్యంలో…
బాపట్ల ప్రాంతం నుండి ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, బాపట్ల పట్టణ కార్యకర్తల కోసం ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, గాజువాక, మద్దిలపాలెం, నర్సీపట్నం ఆర్టీసీ డిపోలకు చెందిన ప్రత్యేక బస్సులు, ఇతర ప్రత్యేక వాహనాల్లో వైసిపి కార్యకర్తలు మెదరమెట్లకు తరలి వెళ్లారు.

➡️