సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Dec 10,2023 23:23

ప్రజాశక్తి – బాపట్ల
సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, యువత అవగాహన కలిగి ఉండాలని పట్టణ సీఐ యు శ్రీనివాసులు అన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద సైబర్‌ జాగరూక దివాస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాం కింగ్‌ వివరాలు అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌, పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, కెవైసీలను అప్‌డేట్‌ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించ వద్దని సూచించారు. సైబర్‌ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఇంటర్నెట్‌ను పరిమితికి మించి వాడకూడదని సూచించారు. సైబర్‌ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారని అన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల మాటలను నమ్మరాదని తెలిపారు. తెలియని మెసేజ్‌లపై క్లిక్‌ చేయరాదని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు మాయ మాటలు చెప్తూ బహుమతులు వచ్చాయని, లాటరీ తగిలిందని, రుణాలు ఇస్తామని, ఇతరత్రా ఆశచూపి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులకు ఎర వేస్తారని తెలిపారు. అటువంటి వ్యక్తులు పంపే మెసేజ్‌లకు స్పందించ రాదని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ విక్టర్, జగన్, కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️