మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

Jan 1,2024 00:57

ప్రజాశక్తి – చీరాల
మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. 6వ రోజు సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్ బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల నిరంకుశంగా వ్యవహరిచడం దారుణం అన్నారు. కరోనా విపత్కర పరిస్థితిలో ప్రజలు, అధికారులు ప్రాణభయంతో ఇళ్లకు పరిమితమైన సందర్భంలో కూడా మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి వీధులను శుభ్రం చేసి కరోనాను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆనాడు మున్సిపల్ కార్మికుల శ్రమను గుర్తించి కరోనా వారియర్స్ అని అవార్డులు ఇచ్చి కాళ్లు కడిగి సన్మానం చేసిన ప్రభుత్వమే ఈరోజు ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని అన్నారు. కార్మికులు రోడ్డు ఎక్కితే నిర్బంధ చర్యలు పూనుకోవడం దుర్మార్గమని అన్నారు. పోటీ కార్మికులను తీసుకురావడం, సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేయడం హేయమైన చర్యని అన్నారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కార్మికులపై బెదిరింపులు చేయడం సరైన చర్య కాదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం, పర్మినెంట్, సంక్షేమ పథకాల అమలు తదితర డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె, పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు నూతలపాటి రాజు, కార్యదర్శి ఎండ్లూరు సింగయ్య, కోశాధికారి మానికల శంకర్, బడుగు కుమారి, గూడూరు కోటేశ్వరమ్మ, వై సంధ్యా, బి విజయమ్మ, సిరీషా, తిరుపతమ్మ, యశోద, సుబ్బమ్మ, ఆంజనేయులు, రేణుమాల నసాగరాజు, గూడూరు శిరీష, పద్మ పాల్గొన్నారు.


అద్దంకి : మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్ట్చ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె ఆరో రోజూ నిర్వహించారు. నిరసన శిభిరం వద్దనే వంటావార్పుతో పాటు మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలపుకోవాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల పట్ల వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ బానిసలుగా పని చేయించుకుంటున్నారని అన్నారు. నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకుల పి ఆదామ్, భీష్మ పాల్గొన్నారు.

➡️