భవిష్యత్తుకోసం టిడిపిని గెలిపిద్దాం : అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

Jan 29,2024 00:43

ప్రజాశక్తి – పంగులూరు
రాష్ట్రం బాగుపడాలనే తలంపుతో టిడిపిలోకి వరుస వలసలు జరుగుతున్నాయని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. వైసిపి అరాచక పాలన నుండి బయటపడాలనే టిడిపిలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. మండలంలోని రేణింగవరం మాజీ ఎంపీటీసీ సభ్యుడు బోరెడ్డి ఓబుల్‌రెడ్డి ఆయన అనుచరులకు ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ టిడిపికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేద్దామని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి కచ్చితంగా టిడిపిలో గుర్తింపు ఉంటుందని అన్నారు. టిడిపి హయాంలో పల్లెలు అభివృద్ధి బాటలో పయనించాయని అన్నారు. నేడు పన్నుల బాదుడుతో కనీసం రోడ్ల గుంతలకు మట్టి పోయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బడ్జెట్లో పట్టణ అభివృద్ధికి నిధుల కోత పెట్టిందని అన్నారు. సిమెంటు డిజిటల్, పెట్రోల్ ధరలు పెంచారని అన్నారు. ఒక్కొక్క కుటుంబంపై నాలుగు నరేళ్ళలో రూ.రెండు లక్షల ధరలు, పన్నుల భారం మోపారని చెప్పారు. అన్న క్యాంటీన్, నిరుద్యోగ భృతిని రద్దు చేశారని అన్నారు. అవ్వ, తాతలకు ఐదేళ్లు ద్రోహం చేసి రివర్లో రూ.3వేలకు పెంచారని అన్నారు. పన్నులు కట్టాలంటే, ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎన్నడూ లేనివిధంగా చెత్తపై పన్నులు వేశారని అన్నారు. టిడిపి హయాంలో సింగరకొండ దగ్గర రూ.కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జి ప్లస్ త్రి ఇళ్ళ నిర్మాణాన్ని 90శాతం పూర్తి చేస్తే వైసిపి అటక ఎక్కించిందని అన్నారు. పేదవాడి సొంత ఇంటి కలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో వైసిపి నాయకులు జేబులు నింపుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలను అడిగిన వారిపై, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తూ జగన్మోహన్‌రెడ్డి ఆనందం పొందుతున్నాడని ఆరోపించారు. త్వరలో వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ను చూడబోతున్నామని అన్నారు. నవరత్నాల పేరుతో అభివృద్ధి లేకుండా చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని అన్నారు. జనసేన- టిడిపి అధికారంలోకి రానుందని, ప్రజాపాలన అందిస్తామని పేర్కొన్నారు. రవికుమార్‌ను భారి ఊరేగింపుతో గ్రామంలోకి తీసుకువచ్చారు. మహిళలు హారతి అందించారు.
అద్దంకి : జగన్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని అన్నారు. ప్రస్తుతం రైతులు సాగునీటికీ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసిపి అసమర్ధత వల్ల దరలు పెరుగుతున్నాయని అన్నారు. వైసిపి అభ్యర్థులకు సీట్లు ప్రకటిస్తుంటే అభ్యర్థులు మాత్రం వైసీపీని వదిలిపెట్టి పారిపోతున్నారని అన్నారు. ఈపాటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు వైసీపీని వదిలి పెట్టి వెళ్లారని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది వైసిపిని వీడి వెళ్లిపోతారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళఖాతంలో కలిపేయడం ఖాయమని అన్నారు.

➡️