దిగుబడి తగ్గిన మామిడి పంట

May 23,2024 00:06 ##Low #yield #mango #crop

– నష్టాలు ఊబిలో మామిడి రైతులు
– మార్కెట్లో ధరలు మండిస్తున్న మామిడి
– ధర ఉన్న దిగుబడి లేకపోవడంతో రైతుల నిరాశ
ప్రజాశక్తి – అద్దంకి
మండలంలో పదుల సంఖ్యలో మామిడి తోటలు ఉన్నాయి. రైతులు ఉత్సాహంగా మామిడి సాగు చేశారు. అయితే ఈ ఏడాది మామిడి తోటల్లో పూత దశ నుండి అనేక చీడపీడలు ఏర్పడడంతో మామిడి కాపు తగ్గిపోయిందని మామిడి రైతు చాగంటి గణపతి తెలిపారు. వేసవి వచ్చిందంటే ప్రజలు మామిడి కాయలను విరివిగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ధనిక, పేద తేడా లేకుండా ఫలాల్లో రారాజైన మామిడి కాయలు ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఏడాది మామిడి కాయల దిగుబడి తక్కువగా ఉండడంతో ధరలు అధికం అయ్యాయి. ప్రస్తుతం ధరలు చూసిన ప్రజలు పెద్దగా మామిడి జోలికి వెళ్లడంలేదు. నియోజకవర్గంలోని వెంపరాల, మైలవరం, కొత్తూరు, తదితర గ్రామాల్లో 500 ఎకరాలకుపైగా రైతులు మామిడి సాగు చేశారు. ఈ ఏడాది అనూహ్యంగా ఎండలు పెరిగాయి. దీనికితోడు వర్షాభావ పరిస్థితులతో మామిడి తోటల్లో దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది పట్టణానికి మామిడి కాయల దిగుబడి తక్కువగానే ఉంది. గతంలో ఉలవపాడు, సింగరాయకొండ, టంగుటూరు, కందుకూరు ప్రాంతాల నుండి పండ్ల వ్యాపారులు దిగుమతి చేసుకొని వ్యాపారాలు చేస్తుండేవారు. ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో ధరలు అధికం కావడంతో మామిడి కాయల దిగుమతి తక్కువగానే చేసుకున్నారు. మామిడి తోటలో పూత రాలిపోయి దిగుబడి శాతం తగ్గిందని రైతులు అంటున్నారు. అద్దంకి ప్రాంతానికి విజయవాడ, నూజివీడు ప్రాంతాల నుండి మామిడి కాయల వ్యాపారస్తులు దిగుమతి చేసుకుంటారు.
మామిడి రైతులకు నష్టమే
అద్దంకి పరిసర ప్రాంతాల్లో మామిడి రైతులు నష్టాలు చవిచూసే పరిస్థితి ఏర్పడిందని మామిడి రైతు మోటుపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తాను 18 ఎకరాల్లో మామిడి సాగుచేసినట్లు చెప్పారు. గత నాలుగేళ్ల కాలంలో ఈ ఏడాది అత్యధిక దిగుబడి వస్తుందని ఆశించినప్పటికీ చీడ, పీడల వలన దిగుబడి తగ్గిందన్నారు. పెట్టుబడి మాత్రం ఈ ఏడాది అధికంగానే పెట్టాల్సి వచ్చిందని తెలిపారు.
మార్కెట్లో పెరిగిన మామిడి ధర
పంట తగ్గడంతో మార్కెట్లో ధరలు పెంచేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మామిడి కాయ ప్రియులు వేసవిలో ఎక్కువగా తినగలిగే మామిడి కాయల ధరలను చూసి కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని పండ్ల వ్యాపారులు చెబుతున్నారు.
పండిన కాయలూ రుచి తగ్గాయి
వర్షాభావ పరిస్థితుల కారణంగా చెట్లకు అవసరమైన పోషకాలు అందక పోవడంతో వచ్చిన కొద్దిపాటి దిగుబడి కూడా రుచికరంగా లేవని ప్రజలు చెబుతున్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిశాయి. దీనికితోడు చీడ, పీడలు అధికమయ్యాయి. దీంతో కొద్దిపాటి కాయలు కూడా రుచికరంగా లేవని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో కొనుగోలు దారులను ఆకర్సించేందుకు కార్బైడ్ ఉపయోగించడంతో అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది.

➡️