టిడిపి ప్రభుత్వంలోనే ఎస్సీ క్షేమం : ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్

May 7,2024 00:04 ##Addanki #Gottipati

ప్రజాశక్తి – అద్దంకి
టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్ధి గొట్టిపాటి రవికుమార్‌ పట్టణంలోని 3వ వార్డులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టిడిపి సూపర్ సిక్స్ పధకాలు వివరించారు. ఈనెల 13న జరుగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. వైసిపి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు వైసిపి మూకలు దళితులపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు. ఐదేళ్లలో 6వేలకుపైగా దాడులు జరిగియాని అన్నారు. 158 మందిని హత్య చేశారని అన్నారు. 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారని అన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని నిలిపివేశారని గుర్తు చేశారు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే నాగమ్మ అనే మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించలేక పోయారని పేర్కొన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం ద్వారా ఎస్సీ పేద విద్యార్థులను విదేశాల్లో గొప్ప గొప్ప చదువులు చదివించిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనని అన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేసినట్లు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పధకం ద్వారా ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించామని అన్నారు. ఎస్సీలకు ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్ అమలు చేశామని అన్నారు. ఎస్సీలకి భూమి కొనుగోలు పథకం ద్వారా 2386 ఎకరాల భూమి ఇప్పించిన ఘనత చంద్రబాబుదేనని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయడానికి సత్వర న్యాయం చేయడానికి జిల్లాకొక మొబైల్ కోర్టు ఏర్పాటు చేశారని అన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారి ఎస్సీ రైతులకు 90శాతం సబ్సిడీని టిడిపినే ప్రవేశపెట్టిందని అన్నారు. ఎస్సీ పేద విద్యార్థులకు నూరు శాతం ఫీజు రియంబర్స్‌మెంట్ జిఓ ఎంఎస్ నెం90 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్సీ పేద విద్యార్థులకు చంద్రబాబు చేసిన మేలని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️