ఎస్ఎఫ్ఐ ప్రజ్ఞ వికాసం మోడల్ పరీక్ష

Feb 18,2024 00:02

ప్రజాశక్తి – బాపట్ల
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞ వికాసం మోడల్ పరీక్ష నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆర్య తెలిపారు. మార్చి 18 నుండి రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పర్యవేక్షణలో సబ్జెక్టులో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం వంద మార్కుల మోడల్ ప్రశ్న పత్రాన్ని తయారు చేశారని అన్నారు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించేందుకు ఈ మోడల్ పరీక్ష ఎంతగానో దోహద పడుతుందని అన్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సమస్యలపై పోరాటాలు చేయడమే గాక చదువుల్లో ప్రోత్సహించేందుకు, సృజనాత్మకతను వెలికిదీసేందుకు, అనేక మోడల్ పరీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయం, ఆందోళన పోగొట్టి, పరీక్షల్లో అధిక మార్కులు సాధించే విధంగా రూపొందించిన పరీక్ష విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరమని అన్నారు. పట్టణంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని అన్నారు. పరీక్ష అనంతరం పాఠశాల స్థాయిలో ప్రధమ, ద్వితీయ బహుమతులతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కళ్యాణ్ చక్రవర్తి, వెంకటేష్ పాల్గొన్నారు.

➡️