ఓటును స్వేచ్ఛగా వేసుకోవాలి : డీఎస్పీ మురళీకృష్ణ

Mar 12,2024 00:43

ప్రజాశక్తి – రేపల్లె
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వేసుకోవాలని డీఎస్పీ మురళీకృష్ణ అన్నారు. స్థానిక బస్టాండ్ వద్ద నుండి రింగ్ రోడ్ వరకు పోలీసు బలగాలతో సోమవారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా దళాల పహారా పెంచామని తెలిపారు. పెనుముడి వద్ద ప్రత్యేక పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని అన్నారు. పోలీసులు భద్రత కల్పిస్తారనే బరోసా ప్రజల్లో కల్పించే ఉద్దేశంతోనే కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికలకు అంతరాయం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నియమావళి తప్పకుండా పాటించాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నజీర్ బేగ్, రూరల్‌ సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ హరిబాబు పాల్గొన్నారు.


బాపట్ల : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పట్టణ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన రహదారుల్లో పోలీసులు, కేంద్ర పోలీసు బలగాలతో సోమవారం కవాతు నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ నుండి డిఎంపల్లి వరకు పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.


అద్దంకి : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు తామున్నామనే భరోసా ఇచ్చేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, భవాని సెంటర్, గాంధీబొమ్మ సెంటర్, నార్రవారి పాలెం, గాజులపాలెం, రాంనగర్, బంగ్లా రోడ్డు ప్రాంతాల్లో సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు, పోలీసు అధికారులు సోమవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.


వేటపాలెం : ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చీరాల రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ సూచించారు. మండలంలోని పందిళ్ళపల్లి గ్రామంలో పోలీస్ కవాతు సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో వేటపాలెం, ఈపురుపాలెం ఎస్‌ఐలు జి సురేష్, ఎం శివకుమార్ పాల్గొన్నారు.

➡️