ఆక్రమణలను అడ్డుకుంటాం : హనిమిరెడ్డి

Jan 11,2024 23:59

ప్రజాశక్తి – అద్దంకి
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ యదేచ్చగా సాగుతుందనే ప్రచారం ఎక్కువగా ఉందని, ప్రభుత్వ స్థలాలను పరిశీలించి కాపాడుకునే ప్రయత్నం చేస్తామని వైసిపి ఇన్చార్జ్ పి హనిమిరెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ స్థలాలను ఆయన గురువారం పరిశీలించారు. సింగరకొండ సమీపంలోని కుంట భూములను చదును చేస్తున్నారని, తద్వారా ఆక్రమించు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం అందడంతో రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో ఆ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. భూములను ఆక్రమించుకునే వారి పట్ల సంబంధిత అధికారులు పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే క్రిమినల్ చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడుకునేందుకు స్థలాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయటానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని తాసిల్దార్‌కు సూచించారు. గురుకుల పాఠశాల ప్రక్కన జర్నలిస్టుల కేటాయించిన స్థలాలను పరిశీలించారు. ఐదు ఆరుగురికి ఇంకా ఇంటి స్థలాలు రావాల్సి ఉందని, వాటిని కూడా ఇప్పించాలని జర్నలిస్టులు ఆయన ద్రుష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించాలని తాసిల్దార్‌కు సూచించారు. టిడ్కో గృహాలకు అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు అర ఎకరం భూమి కావలసి ఉందని, ప్రస్తుతం 20సెంట్లు మాత్రమే ఉందని సంబంధిత బాద్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూమి ఉందని, దానిని సబ్ స్టేషన్ కేటాయించాలని తాసిల్దార్ సుబ్బారెడ్డిని ఆదేశించారు. ఇసుక, మట్టి ప్రస్తుతం సరఫరా ఆగిపోవడంతో ఇంటి నిర్మాణాలకు ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా ప్రభుత్వంతో మాట్లాడి తగిన అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, మేడగం గోపాలరెడ్డి, కోట శ్రీనివాసకుమార్, కన్నెబోయిన వీరయ్య, కౌన్సిలర్లు కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️