వైసిపి పరిపాలనంతా సంక్షేమమే : ఎమ్మెల్యే కోనా రఘుపతి

Jan 6,2024 00:19

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
వైసీపీ ప్రభుత్వం పాలన అంతా సంక్షేమమేనని ఎమ్మెల్యే కోనా రఘుపతి అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో జరిగిన పెన్షన్ కానుక పంపిణీ సభలో ఆయన మాట్లాడారు. కొత్తగా మంజూరైన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా పెన్షన్‌ను దశల వారీగా పెంచుకుంటూ రూ.3వేలు చేశారని అన్నారు. గతంలో అరకొరగానే పెన్షన్ పథకం ఉండేదన్నారు. ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని అన్నారు. గతంలో పథకాలు రావాలంటే అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. నేడు సచివాలయాల్లోనే అర్హతలను పరిశీలించి అన్నీ పధకాలను లబ్దిదారులకు ,అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో 6735 మందికి సామాజిక పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ల కోసమే రూ.కోటి 85లక్షలు ఖర్చు చేస్తుందని చెప్పారు. అభివృద్ధి పనులు సైతం నిరాఘాటంగా జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఒక చిన్న పట్టణంగా ఉన్న బాపట్ల నేడు నగరం రూపు సంతరించుకుందని చెప్పారు. విశాలమైన రోడ్లు, మిరుముట్లు గొలిపే విద్యుత్ దీపాలు, జాతీయ రహదారులు, ప్రభుత్వ వైద్య కళాశాల వంటి నిర్మాణాలు చకచగా జరిగిపోతున్నాయని అన్నారు. అభివృద్ధి ఫలాలు పూర్తిగా పొందాలంటే మరికొన్నాళ్లు వేసి చూడాలని అన్నారు. అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలంటే వైసిపి ప్రభుత్వానికి మళ్లీ ప్రజలు పట్టం కట్టాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో సిఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, బాపట్ల ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, వెంకటరమణ, వైసిపి పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్, వైసిపి నాయకులు చల్లా రామయ్య, కదిరిన్ రాజా, షేక్ పీరు పాల్గొన్నారు.

➡️