నూతన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షల వెల్లువ

Jun 7,2024 22:28

ప్రజాశక్తి – వినుకొండ : ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవి ఆంజనేయులు ఇంటి వద్ద శుక్రవారం కూటమి పార్టీల శ్రేణులు, అభిమానులతో కోలాహలం నెలకొంది. జీవీ ఆంజనేయులును కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు వినుకొండ పట్టణానికి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో కొత్తపేటలోని జీవీ నివాసం వద్ద మూడ్రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది. వారందరికీ జీవీ ఆంజనేయులు అభివాదం చేస్తూ ప్రజలకు తానెంతో రుణపడి ఉన్నానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పారు. వినుకొండ పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం తోపాటు, నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని, పల్నాడు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన వరికపూడిసెల ప్రాజెక్టును అనతికాలంలోనే పూర్తి చేస్తామని హామీనిచ్చారు. సమస్యల పరిష్కారానికి, గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు చేపట్టే అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని కోరారు.

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం సత్తెనపల్లికి రాగా కూటమి పార్టీల శ్రేణులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. మండలంలోని నందిగామ అడ్డరోడ్డు నుండి సత్తెనపల్లిలోని రఘురాం నగర్‌ టిడిపి కార్యాలయం వరకు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం టిడిపి ప్రజావేదికలో టిడిపి శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను లకీëనారాయణ కట్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడంతోపాటు సత్కరించారు.

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్రాభివృద్ధి టిడిపి ద్వారానే సాధ్యమని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. మండల కేంద్రమైన రొంపిచర్లలో శుక్రవారం పర్యటించిన ఆయనకు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాత టిడిపి జెండా ఎగరటం సంతోషంగా ఉందన్నారు. ఈ నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా బిసి సామాజిక తరగతికి చెందిన తనను ఎన్నుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. తన విజయానికి కృ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేతోపాటు టిడిపి నాయకులు కపిలవాయి విజరు కుమార్‌, వేల్పుల సింహాద్రి యాదవ్‌ను నాయకులు సత్కరించారు. టిడిపి మండల అధ్యక్షుడు పులుకూరి జగ్గయ్య, కార్యదర్శి పల్లెల నాగిరెడ్డి, నాయకుల పచ్చవ కోటేశ్వరరావు, నెల్లూరి పాపారావు, పొనుగోటి వెంకటేశ్వర్లు, కల్లి మల్లారెడ్డి, డి.సాంబశివరాజు పాల్గొన్నారు.

ప్రజాశక్తి – నరసరావుపేట : ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్‌ చదలవాడ అరవిందబాబును పలువురు ప్రభుత్వ అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలోపల్నాడు జిల్లా అడిషనల్‌ ఎస్పీ రాజు, నరసరావుపేట డీఎస్పీ సుధాకర్‌, డిఆర్‌ఒ వినాయకం, ఆర్డీవో సరోజినీ, నరసరావుపేట మున్సిపల్‌ కమిషనర్‌ సి.రవిచంద్రరెడ్డి, నరసరావుపేట పట్టణ, రూరల్‌ పోలీస్‌ అధికారులు ఉన్నారు.

ప్రజాశక్తి – మాచర్ల : ఎమ్మెల్యేగా ఎన్నికైన జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం నాయకులు శుక్రవారం గుంటూరులోని ఆయన నివాసంలో కలిసి సత్కరించారు. సంఘ నాయకులు కంభంపాటి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ మాచర్ల అభివృద్ధికి ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి చేసే కృషిలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఎమ్మెల్యే బ్రహారెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు తాను పూర్తి అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో రామక్రిష్ణ, కట్టమూరి శివ, విజరు, శేఖర్‌, సత్యం, రవితేజ, అంజి పాల్గొన్నారు.

➡️