భానుడి భగభగలు

Apr 4,2024 15:45 #Kurnool, #Summer

పగలు వేడి సెగలు
భయపడుతున్న జనం

ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : వేసవి కాలం భానుడి భగభగలతో, పగలు వేడి సెగలతో ఉదయం 10:00 గంటలకే బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. వేడి వడగాలుపులతో వడదెబ్బలు తగిలి జ్వరం తో తీవ్ర అస్వస్థతకు లోనై చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. నగరంలో చెట్లు లేకపోవడం, వీటికి తోడు ద్విచక్ర వాహనాలు ఆటోలు బస్సులు, కార్లు ఎక్కువగా తిరుగుతుండడంతో వాటి పొగలతో కర్నూలు నగర ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరింది. ఈ పరిస్థితుల నుండి బయట పడాలంటే తప్పనిసరిగా మనిషి కాటన్ దుస్తులను ధరించాలి. తలకు తలపాగా, టోపీ, గొడుగు లాంటివి తప్పకుండా వాడాల్సి ఉంటుంది. మహిళలు స్కార్పులు చేతులకు గ్లౌజులు కాళ్లకు సాక్స్ లు పూర్తిగా శరీరము కప్పి ఉండే విధంగా దుస్తులను ధరించాలి. కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకోవాలి. గతంలో వేసవి కాలం వచ్చిందంటే పల్లెల్లో పట్టణాల్లో పెద్ద మట్టి బాణాలను పెట్టి నీళ్లు పోసి చలివేంద్రాలు పెట్టేవారు. చలివేంద్ర మాన్యాలు కూడా పెట్టి నీరు పోసేవారు. పాదచారులకు నీళ్లు పోసేందుకు ఒక మనిషిని ఉంచేవారు. కొత్త కుండల్లో ఉన్నటువంటి చల్లని నీళ్లు తృప్తిగా తాగి కడుపు చల్లబరుచుకునేవారు. చెట్లని చల్లటి నీడలో సేదతీరే వారు. కాలానుగుణంగా రోజురోజుకు అలాంటివి కనుమరుగవుతున్నాయి. వాటి స్థానంలోమారిన పరిస్థితులను బట్టి కృత్రిమంగా తయారు చేసిన చల్లని నీటి క్యాన్లు, ఐస్ లాంటివి నీళ్లలో వేసి చల్లబరుస్తున్నారు. వేడిమి తాపానికి తట్టుకోలేని ప్రజలునీరు ఏదైతే నేమి చల్లగా ఉంటే చాలు అని తాగేస్తున్నారు. దీనితో గొంతు సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. దగ్గు తో బాధపడుతున్నారు. ఎలాంటి నీరు వాడి ఐస్ తయారు చేస్తున్నారో తెలియదు చల్లదనం కోసం అలాంటి ఐస్ ను చెరుకు రసాలు, కూల్ డ్రింక్స్ లలో కలిపి ఇస్తున్నారు. కర్నూలు నగర జనాభా ఆరు లక్షలకు పైగా ఉండడం చేత, మానవ తప్పిదంతో వర్షాలు కూడా సక్రమంగా కురవక జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. జనాభాకు తగినంత నీరు కర్నూల్ నగరపాల సంస్థ అందించలేని పరిస్థితిలో ఉంది.

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

నగరపాలక సంస్థ కార్యాలయం వారు నగరంలో ప్రధాన కూడళ్లలో భవన నిర్మాణ కార్మికుల అడ్డాల్లో (ఆర్ఎస్ రోడ్, గడియారం ఆసుపత్రి, బిర్లా గేట్, చెన్నమ్మ సర్కిల్, చౌరస్తా, తదితర ప్రాంతాల్లో చలువ పందిళ్ళు వేసి, చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా కమిషనర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేధస్సు గల మానవుడే తమ స్వార్థ ప్రయోజనాల కోసం చెట్లను నరికేస్తూ, రోడ్లను సిమెంటు కంకర ఇసుక కలిపి ఏమాత్రం మట్టి లేకుండా రోడ్లు చేసేస్తున్నారు. దీనితో వర్షాకాలంలో వర్షపు నీరు ఇంకడానికి అవకాశం లేకుండా పోతుంది. ప్రతి మానవుడు తన పరిసరాల్లో ఇండ్లలో ఎత్తైన ప్రదేశాల్లో పక్షుల కోసం నీటి తొట్లను ఏర్పాటు చేయాలి. ఆహారపు చిరుధాన్యాలను కూడా వాటికి పెట్టి సంరక్షించాలి. వర్షాకాలంలో మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఇంటి యజమాని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే వృక్షో రక్షిత రక్షితః అంటే మనం వృక్షాలను సంరక్షించినట్లయితే అవి మనలను రక్షించి ఆక్సిజన్, పండ్లు, ఫలాలు, పూలు, ఆకులు , మానవునికి కావాల్సినవన్ని సమకూరుస్తాయి. అలాగే నీటిని పొదుపుగా వాడుకొని వేసవి గండం నుండి బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️