భోగాపురం టూ నెల్లిమర్ల

Apr 9,2024 21:13

ప్రజాశక్తి – పూసపాటిరేగ : ప్రస్తుత నెల్లిమర్ల నియోజకవర్గం గతంలో భోగాపురం నియోజకవర్గంగా ఉండేది. అప్పటి భోగాపురం నియోజకవర్గంలో భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాలుండేవి. 2009లో నియోజకవర్గాల పుణర్విభజనలో భాగంగా నెల్లిమర్ల మండలాన్ని ఇందులో కలిపి నెల్లిమర్ల నియోజకవర్గంగా రూపాంతరత చెందింది. 1955లో భోగాపురం నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో 2009 వరకూ 12 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొదటిగా ప్రజాసోషలిస్ట్‌ పార్టీ విజయం సాదించగా, ఐదు సార్లు కాంగ్రెస్‌, ఆరు సార్లు టిడిపి విజయకేతనం ఎగరవేసాయి. 1955లో భోగాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే మొదటి ఎన్నికకు 57,809 మంది ఓటర్లు ఉండేవారు. అప్పటి కాంగ్రేస్‌ అభ్యర్థి ఆర్‌. సన్యాశిరావుపై ప్రజా సోషలిస్ట్‌ పార్టీ అభ్యర్థి బొత్స ఆదినారాయణ ( మాజీ మంత్రి పడాల అరుణ తండ్రి) సుమారుగా 15వేల ఓట్లు మెజార్టీతో విజయం సాదించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రేస్‌ అభ్యర్ధిగా కొమ్మూరు అప్పడుదొర బరిలో దిగారు. ఆయనపై బొత్స ఆదినారాయణ ప్రజా సోషలిస్ట్‌ పార్టీని వదిలి ఇండిపెండెంటుగా బరిలోకి దిగారు. ఆ కాలంలో నియోజకవర్గంలో 53,201 ఉండగా 37,051 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో అప్పడుదొర సుమారుగా 11 వేల ఓట్లు మెజార్టీతో గెలిపొందారు. 1967 ఎన్నికల్లో అప్పడు దొరపై ఇండిపెండెంటుగా ఎం. సత్యనారాయణ ( పూసపాటిరేగ ఎంపిపి భర్త పండుశ్రీను తండ్రి ) పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1972 ఎన్నికల్లో అప్పడుదొరపై బి. రామునాయుడు ఇండిపెండెంటుగా పోటీ చేసి ఓటమి చవిచూసారు. 1978లో అప్పడుదొరపై జనతా పార్టీ నుండి పతివాడ నారాయణస్వామి నాయుడు బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్బావంతో టిడిపి తరుపున పతివాడ నారాయణస్వామినాయుడు పోటీచేసి అప్పడుదొరపై సుమారుగా 9,436 ఓట్లు మెజార్టీతో విజయం సాదించారు. అప్పడుదొర మొదటి సారి పతివాడ చేతిలో ఓటమి చవిచూసారు. అప్పటి నుండి వరుసగా 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో అప్పడుదొర, అతని తమ్ముడు సంజీవరావుపై పతివాడ విజయ దుందిబి మోగించారు.

నియోజకవర్గ పుణర్విభజన

నియోజకవర్గ పుణర్విభజనలో భాగంగా 2009లో భోగాపురం నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గంగా మారింది. పునర్విభజన తరువాత వచ్చిన తొలి ఎన్నికల్లో టిడిపి నుంచి పతివాడ, కాంగ్రేస్‌ అభ్యర్ధిగా బడ్డుకొండ అప్పలనాయుడు, ప్రజారాజ్యం పార్టీ నుండి కొమ్మూరు సంజీవరావు అల్లుడు కందుల రఘుబాబు మధ్య త్రిముఖ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో పతివాడ స్వల్ప ఓట్లుతో ఓటమి చవిచూసారు. కాంగ్రేస్‌ అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు విజయదుందబి మోగించారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరుపున పతివాడే బరిలో ఉన్నారు. కాంగ్రేస్‌ తరుపున బడ్డుకొండ, వైసిపి తరుపున డి. సురేష్‌బాబు మద్య త్రిముఖ పోటీ జరిగింది. అయితే పతివాడ నారాయణస్వామి నాయుడు ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాదించారు. 2019లో పతివాడపై వైసిపి నుండి బడ్డుకొండ అప్పలనాయుడు పోటీ చేసి సుమారుగా 28 వేల ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. ఇలా ఇప్పటి వరకూ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పతివాడ నారాయణస్వామి నాయుడు ఏడుసార్లు, కొమ్మూరు అప్పడుదొర నాలుగుసార్లు, బడ్డుకొండ అప్పలనాయుడు రెండు సార్లు, బొత్స ఆదినారాయణ ఒకసారి విజయం సాదించడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. అప్పడుదొర జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసారు. ఈయన సోదరుడు అప్పలస్వామి ( సంజీవరావు) విశాఖ ఎంపిగా ఒకసారి విజయం సాదించారు. పతివాడ నారాయణ స్వామినాయుడు 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చక్కెర, ఉద్యాణవన శాఖా మంత్రిగా, 2014లో ప్రోటెం స్పీకర్‌గా గౌరవం పొందారు.

టిడిపి, కాంగ్రెస్‌ గల్లంతు

మొదటి నుండి నువ్వా నేనా అన్న చందగా టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు ఈ నియోజకవర్గంలో పోటీ పడేవి. కాలంతో పాటు పార్టీలో వస్తున్న మార్పులు వల్ల 2024 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు గల్లంతయ్యాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుండి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పై జనసేన ( కూటమి) నుండి లోకం మాధవి పోటీలో ఉన్నారు. ఈ సారి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

➡️