ప్రచార అనుమతి తప్పనిసరి : జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌

ప్రజాశక్తి -నెల్లూరు : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నియమావళిని అనుసరించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార అనుమతులు తప్పక తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ … ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీల సమావేశాల నిర్వహణ, మైక్‌ సెట్టింగ్‌, ఆయా పార్టీల తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు, వాహనాల వినియోగం, ప్రదర్శనలు, అందులో ఉపయోగించే లౌడ్‌ స్పీకర్లు, వీధి సమావేశాలు, గాలి బెలూన్ల ఏర్పాటు, అంతర జిల్లాల ప్రచార వాహనాలు, బ్యారికేట్ల ఏర్పాటు, మైకులు లేకుండా ఏర్పాటు చేసే సమావేశాలు, ఇంటింటి లేదా గడపగడప ప్రచారం చేయడానికి ఆయా నియోజక వర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. కరపత్రాల పంపిణీ, జెండాలు, బ్యానర్ల ఏర్పాటు, వాల్‌ పోస్టర్లు అతికించడం, హౌర్డింగ్‌ల ఏర్పాటుకు అనుమతులు తప్పక తీసుకోవాలని తెలిపారు. పత్రికా ప్రకటనలు, స్టిక్కర్లు అతికించడం, సాంస్కఅతిక కార్యక్రమాలు, తదితర ఏ కార్యక్రమం అయినా ప్రచారంలో భాగంగానే పరిగణిస్తామని వివరించారు. ప్రతి అంశానికి ఆయా ప్రాంతాల ఎన్నికల అధికారి అనుమతిపత్రం తప్పక కలిగి ఉండాలని, సంబంధిత అధికారులు అడిగినపుడు సమర్పించాలని, అలా చేయకపోతే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరించారు.

➡️