అటకెక్కిన భూ పంపిణీ

అటకెక్కిన భూ పంపిణీ

అటకెక్కిన భూ పంపిణీ ప్రజాశక్తి – వి కోట: భూమి లేని నిరుపేదలు ప్రభుత్వ భూములను చదును చేసుకుని అసైన్మెంట్‌ పట్టాల కోసం అన్నదాతలు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. గుట్ట..చెట్టు…రాయి.. రప్పా..తొలగించి సాగుకు యోగ్యంగా మలుచుకున్న భూములకు పట్టాల కోసం దరఖాస్తు చేశారు. జాబితాలు సిద్ధమయ్యాయి..అసైన్మెంట్‌ కమిటీ ఆమోదమే తరు వాయి..అధికారులు బదిలీ అయ్యారు..ప్రక్రియ ఆగిపోయింది.. అన్నదాతల్లో ఆందోళన నెలకొంది..పట్టాలు ఇస్తారా.. ఉసూరు మనిపిస్తారా..? అసైన్మెంట్‌ కమిటీ పైనే అన్నదాతలు ఆశలు పెట్టు కున్నారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లో అసైన్మెంట్‌ భూముల పట్టాల పంపిణీ ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయింది. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ పంపిణీ నిర్వహించింది. ఆ సందర్భంలో పలువురు రైతులకు సమాచారం తెలియక దరఖాస్తు చేసుకోలేదు. మండలాల వారీగా 50 నుంచి 20 మంది రైతులు మాత్రమే పట్టాలు పొందారు. ఈ విషయమై అర్హులైన పలువురు రైతులు జాయింట్‌ కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లారు. భూ పంపిణీ ద్వారా పట్టాలు పంపిణీ చేయాలని మొరపెట్టు కున్నారు. దీంతో రెండో విడత అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని మండల తహశీల్దార్లను వారు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అధికారులు అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో భూములను పరిశీలించి జాబితాలు సిద్ధం చేశారు. జిల్లా అసైన్మెంట్స్‌ కమిటీ దష్టికి జాబితాలు వెళ్లాల్సి ఉంది. ఇంతలో సాధారణ ఎన్నికల విధుల్లో భాగంగా తహశీల్దారులను బదిలీ చేశారు. దీంతో భూ పంపిణీ ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయింది. రెవెన్యూ డివిజన్‌ పరిధిలో సుమారు 1500 మంది రైతులు దరఖాస్తు భూముల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త తహశీల్దార్లు బాధ్యతలు చేపట్టారు. అసైన్మెంట్‌ కమిటీ సభ్యుల వద్దకు సంతకాల కోసం జాబితాను తీసుకుపోవాల్సి ఉంది. అయితే తమకేమీ పట్టనట్టు ఎన్నికల పనుల్లో తహశీల్దారులు నిమగమయ్యారు. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. పట్టాలు వచ్చేస్తాయనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు పేదలకు భూ పంపిణీ ద్వారా పట్టాలు ఇచ్చేందుకు చిత్తశుద్ధితో కషి చేస్తున్నారు. పేదల అభివద్ధే లక్ష్యంగా ఆ ప్రక్రియను ఎలాగైనా పూర్తి చేసి పేద రైతులకు లబ్ధి చేకూర్చాలని సంకల్పంతో ముందుకెళుతున్నారు. ప్రస్తుతం భూ పంపిణీ ప్రక్రియ స్తబ్దంగా ఉంది. ఇకనైనా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉషశ్రీ చరణ్‌, కలెక్టర్‌ స్పందించి ఎన్నికల లోపు భూ పంపిణీ ద్వారా పేద రైతులకు పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని రైతన్నలు కోరుతున్నారు. రెండు ఎకరాల భూమికి పట్టా ఇప్పించాలి రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్వీకుల నుండి సాగు చేసుకుంటున్నాం.. దరఖాస్తు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నాం.. జాబితాలో మా పేరు ఉంది. పట్టా కోసం ఎదురు చూస్తున్నాం.. ప్రభుత్వ పెద్దలు , అధికారులు స్పందించి ఎన్నికల కోడ్‌ రాకముందే తమకు పట్టాలు మంజూరు చేసి ఆదుకోవాలి.- బాలసుబ్రహ్మణ్యం, రైతు, వెంకటేపల్లి. భూ పంపిణీ సత్వరం పూర్తి చేయాలిజేసి ఆదేశం కోసం నిరుపేద రైతుల నిరీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాల నిరీక్షణ అనంతరం చేపట్టిన భూ పంపిణీని సత్వరం జిల్లాలో పూర్తిచేసి రైతులకు న్యాయం చేయాలి. ఎన్నికల కోడ్‌ రాకముందే జెసి స్పందించి రెండో విడత భూపంపిణీ పై దష్టి సారించి సత్వరం రైతులకు సహాయం చేయాలి.- నాగరాజు, రైతు, కొమ్మరమడుగు.

➡️