ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

Dec 28,2023 22:14

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమ్మె గురువారానికి ఎనిమిదో రోజు కొనసాగింది. జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీరి పోరాటానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య గురువారం మద్దతు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన కోరికలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని మర్చిపోవడం అత్యంత దారుణమన్నారు. అంగన్వాడీలు వీరోచిత పోరాటం చేస్తున్నారని అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య ధోరణితో వివరించడం బాధాకరమన్నారు. ఉద్యోగ కార్మికుల సమస్యలపై జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాలను ఉదతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగుల జేఏసీ నాయకులు లోకనాథం, శ్రీనివాస యాదవ్‌ పాల్గొన్నారు.

➡️