ఓటరు జాబితా అభ్యంతరాలను పరిష్కరిస్తాం

Dec 8,2023 23:51
ఓటరు జాబితా అభ్యంతరాలను పరిష్కరిస్తాం

జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అబ్జర్వర్‌ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: ఓటరు నమోదు, అవకతవకలకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థలను స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని జిల్లా ఎలక్టోరల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2024పై జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.షణ్మోహన్‌తో కలసి ఏఈఆర్‌ఓలు, తహశీల్దార్లు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2024 ప్రక్రియకు సంబంధించి సంబంధిత ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, తహశీల్దార్లు, బిఎల్‌ఓలు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో క్లెయిముల పరిష్కారంలో బిఎల్‌ఓలు, బిఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బిఎల్‌ఏలను నియామకం కొరకు జాబితాలను ఎన్నికల అధికారికి సమర్పించాలన్నారు. ఓటర్ల జాబితా తయారీపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. యువ ఓటర్ల నమోదు ప్రక్రియలో జిల్లా మెరుగైన స్థానంలో కలదని, ఇందుకు సంబంధించి అందిన క్లెయిములను నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలన్నారు. రికార్డులను పకడ్భందీగా నిర్వహించాలని ఆదేశించారు. బల్క్‌గా వచ్చే క్లెయిముల పరిష్కారంలో త్రిసభ్య కమిటీ పరిశీలించిన అనంతరం కమిటీ నిర్ణయం మేరకు చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయపార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేస్తూ అభ్యర్థనలను పరిష్కరిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.షణ్మోహన్‌ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని 7 నియోజకవర్గాలలో మొత్తం 15,49,152 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 7,63,671 మంది పురుషులు, 7,81,887 మంది స్త్రీ ఓటర్లు, 108 మంది ట్రాన్స్‌ జెండర్లు, 3,486 మంది సర్విస్‌ ఓటర్లు ఉన్నారని, 1,762 పోలింగ్‌ స్టేషన్‌లకు 1,762 బిఎల్‌ఓలను, ప్రతి 10 పోలింగ్‌స్టేషన్‌లకు ఒకరు చొప్పున 176 సూపర్‌ వైజర్‌లను నియమించడం జరిగిందన్నారు. వీరితో పాటు 422 మంది విఆర్‌ఓలు, 74 మంది విఆర్‌ఏలను, 1,025 మంది గ్రామ/వార్డ్‌ సచివాలయ సిబ్బందిని నియమించామన్నారు. పోలింగ్‌స్టేషన్‌ల వారీగా రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు బిఎల్‌ఏలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2024లో భాగంగా 10 అక్టోబర్‌ 2023న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశామని, ఇందులో అభ్యంతరాల స్వీకరణకు 27 అక్టోబర్‌ 2023 నుండి 09 డిసెంబర్‌ 12 వరకు సమయం ఇవ్వడం జరిగిందన్నారు. నవంబర్‌ 4, 5, డిసెంబర్‌ 2, 3 తేదీలలో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై ప్రత్యేక క్యాంపెయిన్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా చేసి 05 జనవరి 2024న తప్పులు లేని తుది జాబితాను విడుదల చేయడానికి కృషి చేస్తామన్నారు. ఫారం-6, 7, 8ల ద్వారా క్లెయిమ్‌లను స్వీకరించడం జరుగుతున్నదని, వీటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు. జనవరి 1, 2024 నాటికి 18 సం.లు నిండే యువత ఓటరుగా నమోదు చేసుకునేందుకు కళాశాల యందు స్వీప్‌ యాక్టివిటీ నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో జెసీ శ్రీనివాసులు, ఇంచార్జ్‌ డిఆర్‌ఓ శివయ్య, చిత్తూరు, నగరి, పలమనేరు ఆర్డిఓ లు చిన్నయ్య, సుజన, మనోజ్‌ కుమార్‌ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ భవానీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీప్రసన్న, టిడిపి ప్రతినిధులు పులివర్తి నాని, దొరబాబు, మురళిమోహన్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి పరదేశి, సిపిఎం ప్రతినిధి గంగరాజు, బిజెపి ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, వైఎస్‌ఆర్సిపి ప్రతినిధి ఉదయకుమార్‌, ఇతర గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️