కాఫీ విత్‌ క్లాప్‌ మిత్ర

Dec 19,2023 21:33

కార్మికులతో కమిషనర్‌ మాటామంతి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: అక్కడ అంతా సమానమే.. అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు (క్లాప్‌మిత్రలు) కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారు. కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ స్వయంగా క్లాప్‌మిత్రలతో మాటల కలిపి యోగక్షేమాలు అడిగారు. ఃకాఫీ విత్‌ క్లాప్‌ మిత్రః ఇందుకు వేదికగా నిలిచింది. మంగళవారం ఉదయం మసీదుమిట్ట వద్ద కార్మికులతో కలిసి కాఫీ తాగుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్య పరిరక్షణ కోసం నగరపాలక సంస్థ నుండి అన్ని రకాల సహకారాన్ని అందిస్తామన్నారు. విధుల్లో ఉన్నప్పుడు చేతి గ్లౌజులు, రేడియం స్టిక్కర్‌ కలిగిన జాకెట్‌ కచ్చితంగా ధరించాలన్నారు. చెత్తసేకరణకు సంచులు కావాలని కార్మికులు అడగగా వెంటనే తెప్పించి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని, క్లాప్‌ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసి అవగాహన కల్పించాలని కమిషనర్‌ క్లాప్‌ మిత్రలు, డ్రైవర్లకు చెప్పారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని ఎందుకు అమలు చేస్తున్నాము, వ్యర్ధాలను తడి, పొడిగా సేకరించడం వల్ల కలిగే లాభాలను, పర్యావరణ పరిరక్షణ అంశాలను వివరించాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా క్లాప్‌ లక్ష్యాలను, ఉద్దేశాలను సాధించేందుకు కషి చేయాలన్నారు. అనంతరం కమిషనర్‌ గిరింపేట పరిధిలో క్లాప్‌ వాహనం రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంహెచ్‌ఓ డాక్టర్‌ లోకేష్‌, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య నరసింహ, లోకనాథం, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, మేస్త్రిలు పాల్గొన్నారు.

➡️