గేటు వసూళ్లు రద్దు చేయాలి : సిఐటియు

Apr 1,2024 22:08
గేటు వసూళ్లు రద్దు చేయాలి : సిఐటియు

ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: నగరి మున్సిపాలిటీలోని ఆటో వర్కర్స్‌కు గేటు వసూలును రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్‌ మున్సిపాలిటి కమిషనర్‌కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని ఏ మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్ల్లోనూ గానీ గేటు వసూలు చేయడం లేదని, నగరిలో మాత్రం గేటు వసూలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో వర్కర్స్‌ డిగ్రీలు చదువుకొని ఉద్యోగం లేక కుటుంబ పోషణకు ఆటో నడుపుతున్నారని, ఓ పక్క పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతుంటే మరోవైపు ఆర్టీవో, పోలీసులు జరిమానాలు పేరుతో వసూళ్లు చేయడంతోపాటు మున్సిపాలిటీ వారు గేటు వసూల్‌ చేయడం వల్ల ఆటోడ్రైవర్ల జీవనం సాగడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పది రూపాయలు ఉంటే 2024 టెండర్లు ఆటోకి 20 రూపాయలు పెంచడం సరైన పద్ధతి కాదున్నారు. పది రూపాయలే కట్టలేక ఇబ్బంది పడుతుంటే అదనంగా రుసుము పెంచడం దారుణమన్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి టెండర్లను రద్దు చేయాలని లేని పక్షంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పవర్లూమ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు పెరుమాళ్‌, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పురుషోత్తం, జైభీం సేన ఆటో వర్కర్స్‌ నాయకులు కే.వెంకటేష్‌, దేవరాజులు, రాజేష్‌,మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️