చిత్తూరులో చిక్కని ఓటరు నాడి

Jan 27,2024 00:04

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో 172వ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థుల విషయంలో ప్రధాన పార్టీలు ఆచీతూచీ అడుగేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ చిత్తూరు నుంచి గెలిచిన అన్ని సందర్భాల్లో 1999 తర్వాత, 1989 ముందు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకే ఓటర్లు విజయాన్నిచ్చారు. 1952 నుంచి కాంగ్రెస్‌, జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలకు సంబంధించి అభ్యర్థులను 5ఏళ్ల కోసారి మారుస్తూ చిత్తూరు ఓటర్లు తీర్పునిచ్చారు. ఈ మేరకు 1989లో ఇండిపెండెంట్‌గా, 1994, 1999లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వరుసగా ముడుసార్లు సీకే బాబు విజయం సాధించారు. కాగా అప్పటి నుంచి కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులు అధికారాన్ని చేపట్టారు. 2019ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆరని శ్రీనివాసులు గెలిచారు. ప్రస్తుత రాజీకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారన్న అంశమే చిత్తూరులో చర్చనీయాంశంగా ఉంది. అందుకే ఏ పార్టీ కూడా వరుస విజయాలు సాధించలేకపోవడమే చర్చకు కారణమైంది.దూకుడు పెంచిన వైసీపీ అభ్యర్థి అధికార వైసీపీ నుంచి చిత్తూరు సమన్వయకర్తగా విజయానందరెడ్డిని అధిష్టానం ప్రకటించింది. దాదాపుగా ఆయనే ఈ ఎన్నికల్లో బరిలో ఉంటారనే తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఏపీఎస్‌ఆర్‌టీసీ వైస్‌ ఛైర్మన్‌గా కీలక పదవిలో ఉన్నారు. ఇప్పటిదాకా చిత్తూరులో వరుస సేవా కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న ఆయన తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో మరింత దూకుడు పెంచారు. చిత్తూరుఅర్బన్‌, రూరల్‌, గుడిపాల మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.టీడీపీ నుంచి ఐదు మంది ఆశావహులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి ఐదు గురు ఆశావహులు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో డికె ఆదికేశవులు తనయుడు డికె శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు గురజాల జగన్మోహన్‌, మాజీ మేయర్‌ కఠారి హేమలత, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజి, తిరుచానూరు సర్పంచ్‌ సీఆర్‌ రాజన్‌ ఆశావాహులుగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా కలిసి పనిస్తామని ఎవరికివారు చెబుతున్నా.. టికెట్‌ తమకే కావాలంటూ ఎవరికివారు ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇటీవల జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఏ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తారనే సందిగ్ధం నెలకొంది. అయితే జనసేన టికెట్‌ కోసం డీకే ఆదికేశవులు నాయుడు మనమరాలు చైతన్య తనకు అవకాశం ఇస్తే తానే జనసేన నుంచి పోటీ చేస్తానంటూ పలు సందర్భాల్లో పేర్కొంది. కాగా ఆమె గత నెల పవన్‌కల్యాణ్‌ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

➡️