పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులు

Jan 2,2024 21:55

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నగరపాలక పరిధిలో ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి కనీస వసతులపై నివేదిక సమర్పించాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కమిషనర్‌ నగరపాలక కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరపాలక పరిధిలోని మొత్తం 150పోలింగ్‌ కేంద్రాలను అధికారులు పరిశీలించాలన్నారు. అలాగే విద్యుదీకరణ, నీటి సరఫరా, ఫర్నిచర్‌, మరుగుదొడ్లు, ర్యాంపు నిర్మాణంపై నివేదిక ఇవ్వాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకా ఏమైనా పనులు చేయాలో తెలుపుతూ నివేదిక సమర్పించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల పరిశీలన కోసం అధికారులను బందాలుగా ఏర్పాటు చేశారు. నగరపాలక పరిధిలో నేటి నుంచి నిర్వహించనున్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణపై కమిషనర్‌ అరుణ నగర పాలక అధికారులు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన షెడ్యూల్‌ వారీగా క్యాంపుల నిర్వహణ పక్కాగా చేపట్టాలన్నారు. క్యాంపులకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత అధికారులు ముందస్తుగా పూర్తి చేయాలని, కౌంటర్ల ఏర్పాటు నిర్వహణ పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే పూర్తిచేసేలా పర్యవేక్షించాలన్నారు. క్యాంపు రోజున నిర్దేశించిన విభాగాల వైద్యులు హాజరయ్యేలా సమన్వయం చేయాలన్నారు. సమావేశంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఎంఈ గోమతి, ఏసిపీ రామకష్ణుడు, సీఎంఎం గోపి, ఆర్వో గోపాలకష్ణ వర్మ, డీఈలు, ఏఈలు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, ఆర్‌ఐలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

➡️