ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వారీగా వసతులపై నివేదిక సిద్ధం చేయండి: కలెక్టర్‌

Jan 2,2024 21:54

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
జిల్లాలో1762 పోలింగ్‌ కేంద్రాలలో ఉన్న వసతులపై పూర్తి నివేదికను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్‌ జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలలో కనీస వసతుల ఏర్పాటు, మరియు పిఓ, ఎపిఓ, మైక్రో అబ్జర్వర్ల నియామక ప్రక్రియకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌కేంద్రంలో అవసరమైన ఫర్నిచర్‌, విద్యుదీకరణ, టాయిలెట్‌ సౌకర్యం, ర్యాంపుల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి పోలింగ్‌కేంద్రాల వారీగా ప్రస్తుతం ఉన్న వసతులపై నివేదికను సిద్ధం చేసి ఈనెల 5వ తేదీ లోపు నివేదికను అందజేయాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ రెడ్డిని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పిఓలు, ఏపిఓలు, మైక్రో అబ్జర్వర్లు సెక్టోరియల్‌ అధికారులు నియామకం కొరకు సంబంధిత శాఖలో అధికారులు సిబ్బంది వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. మైక్రోఅబ్జర్వర్ల నియామకంలో వివిధ బ్యాంకుల, ఇన్సూరెన్స్‌ సంస్థలు పోస్ట్‌ఆఫీస్‌ నుండి వివరాలను అందజేయాలన్నారు. అధికారి, సిబ్బంది వివరాలు ఇచ్చిన నివేదికను పూర్తిగా పూరించి అందజేయాలని సూచించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, జెడ్పి సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి, డ్వామా పీడీ గంగాభవానీ, డీఈఓ విజయేంద్రరావు, సమగ్రశిక్ష ఏపిసి వెంకట రమణారెడ్డి, డివిఈఓ సయ్యద్‌ మౌలా, డిఎల్‌డిఓ రవికుమార్‌, చిత్తూరు కమిషనర్‌ అరుణ, చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి ఆర్డీఓలు చిన్నయ్య, మనోజ్‌ కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, సుజన, ఐసిఓఎల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భవాని, ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ బ్యూలా, పుంగనూరు, పలమనేరు మున్సిపల్‌ కమిషనర్లు నరసింహ ప్రసాద్‌, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️