బిజెపీతో సై’కిల్‌’!మైనార్టీలు,దళితులుఎటువైపు..?టిడిపి శ్రేణుల్లో పెదవి విరుపు

బిజెపీతో సై'కిల్‌'!మైనార్టీలు,దళితులుఎటువైపు..?టిడిపి శ్రేణుల్లో పెదవి విరుపు

బిజెపీతో సై’కిల్‌’!మైనార్టీలు,దళితులుఎటువైపు..?టిడిపి శ్రేణుల్లో పెదవి విరుపుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో కమలం పార్టీ బిజెపితో జనసేన, టిడిపి పొత్తు ఆ పార్టీలకు లాభం చేకూరుస్తుందా? నష్టం వస్తుందా? అన్నదే హాట్‌ టాపిక్‌గా మారింది. వాస్తవాలను పరిశీలిస్తే ఆ పార్టీలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 తిరుపతి ఎన్నికల సభలో అప్పటి ప్రధాని అభ్యర్థి, ఇప్పటి ప్రధాని మోడీ, టిడిపి, జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌తో కలిసి శ్రీవారి సాక్షిగా నవ్యాంధ్రకు విభజన చట్టాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తూ, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు రాజధాని నిర్మాణానికి కేంద్రం తమవంతు సహకారం అందిస్తుందని చెప్పారు. అయితే ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా, రాజధాని నిర్మాణానికి చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారు. రాష్ట్రాభివృద్ధికి 5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే కేంద్ర పరిశ్రమలను తీసుకొస్తామని సెలవిచ్చారు. పదేళ్లపాటు పాలన సాగించారు. చంద్రబాబు ఐదేళ్లు, జగన్‌ ఐదేళ్లు పూర్తయ్యిందే తప్ప కేంద్రానికి జనసేన, వైసిపి, టిడిపిలు దాసోహమయ్యాయి. ఇంత ద్రోహం చేస్తున్న బిజెపితో మళ్లీ టిడిపి పొత్తు పెట్టుకోవడంపై తిరుపతి, చిత్తూరు జిల్లాల ఓటర్లు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. టిడిపి, జనసేన శ్రేణులు బిజెపితో పొత్తుపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా పుంగనూరు, పలమనేరు, చిత్తూరు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ముస్లీం ఓటర్లు ఉన్నారు. పూతలపట్టు, జీడీనెల్లూరు, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో దళితులు ఎక్కువగా ఉండడంతో వారి ఓట్లు బిజెపికి పడే పరిస్థితి ఉండదన్నది విశ్లేషకుల అంచనా. శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లోనూ శాసించే స్థాయిలో లేకపోయినా గణనీయంగానే ముస్లీం, క్రిష్టియన్‌ ఓటర్లు ఉన్నారు. బిజెపి ఒక్క సీటు కూడా ఈ రాష్ట్రంలో లేనప్పటికీ రాష్ట్రాన్ని రాజ్యమేలుతోంది. సోమవారం మూడు పార్టీల కూటమి అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే తిరుపతి పార్లమెంట్‌ స్థానాన్ని బిజెపి కోరుతోంది. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మోడీపై వ్యతిరేకతతో టిడిపి, జనసేన అభ్యర్థులపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఏదిఏమైనా బిజెపితో పొత్తు టిడిపి, జనసేనలకు లాభం కంటే నష్టమే ఎక్కువన్న చర్చ నడుస్తోంది. వైసిపి ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కేసుల భయంతో అణగిమణగి ఉంటుంది. ఏదిఏమైనా రాష్ట్రంలో ‘మత’ రాజకీయానికి మూడు పార్టీలు కొమ్ముగాస్తున్న నేపథ్యంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.

➡️