వైసీపీ నేత దాష్టీకం

Dec 25,2023 23:07
వైసీపీ నేత దాష్టీకం

దారి తగాదాలో రైతులను చితకబాదిన జెడ్పిటీసీ, అనుచరులు
తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలైన బాధితులు
న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు
ప్రజాశక్తి-గుడుపల్లి: దారి తగాదాలో వైసీపీ జెడ్పిటీసీ అతని అనుచరులు కలిసి రైతులపై విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన ఆదివారం సాయంత్రం గుడుపల్లి మండలం వెంకటాపురంలో చోటుచేసుకుంది. బాధిత రైతులు రామప్ప, అతని కుమారులు సోమశేఖర్‌, బాలరాజు, సోదరుడు బేటప్ప కథనం మేరకు.. మండలంలోని చీకటిపల్లి పంచాయతీ వెంకటాపురం గ్రామంలో జెడ్పీటీసీ కృష్ణమూర్తి తన అనుచరులకు అనువైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్ధేశ్యంతో రైతుల పొలంగుండా దారి నిర్మించేందుకు యత్నించారు. ఆదివారం తన అనుచరులతో కలిసి జెసీబీతో పనులు ప్రారంభించారు. తమ పొలాల వద్ద రోడ్డు ఏర్పాటు చేయడాన్ని రైతులు ఆక్షేపించారు. పరస్పర వాదోపవాదాలు జరిగాయి. ఆగ్రహించిన జెడ్పిటీసీ అనుచరులతో కలసి విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత రైతులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్నారు. అన్యాయంగా అధికారం అడ్డుపెట్టుకొని దౌర్జన్యంతో తమ పొలాల గుండా దారి ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్నారని, ప్రశ్నించినందుకు దారుణంగా కొట్టారని బాధితులు ఆసుపత్రిలో మీడియాకు వివరించారు. అన్యాయంగా తన భర్త, కుమారులు, బావపై దాడి చేసిన జెడ్పీటీసీ అతని అనుచరులపై చర్యలు చేపట్టాలని రామప్ప భార్య పద్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితులకు పలువురి పరామర్శ.. వెంకటాపురం రైతులపై జెడ్పీటీసీ కృష్ణమూర్తి అతని అనుచరులు దాడి చేసిన సంఘటనపై టీడీపీ, జనసేన నాయకులు అమీర్‌, విజరుకుమార, రామయ్య, నారాయణప్ప తీవ్రంగా ఖండించారు. సోమవారం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️