పోరాడే వ్యక్తులను ఎన్నుకోండి

May 10,2024 21:47

మతోన్మాదులను ఓడించాలి
రాజ్యాంగ రక్షణ మన బాధ్యత : సిపిఎం

ప్రజాశక్తి – గరుగుబిల్లి/జియ్యమ్మవలస :  రాబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించి, మతోన్మాదులను ఓడించి, రాజ్యాంగానికి రక్షణ కల్పించాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, సాలూరు మండలాల్లో సిపిఎం ఆధ్వర్యాన బైక్‌ ర్యాలీలు చేపట్టారు. గుమ్మలక్ష్మీ పురంలో ర్యాలీని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి, గరుగుబిల్లిలో కె.లోకనాధం ప్రారంభించారు. సీమనాయుడువలస జంక్షన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ పెదమేరంగి, సింగనాపురం చినకుదమ, తురకనాయుడు వలస, లకనాపురం, రావివలస, కారివలస, నాగూరు మీదుగా ఉల్లిభద్ర జంక్షన్‌ వరకు సాగింది.ఈ సందర్భంగా సిపిఎం నాయకులు లోకనాధం, మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షి ంచుకోవాలంటే బిజెపిని, దానికి మద్దతిస్తున్న తెలుగుదేశం, వైసిపిలను ఓడించాలని, సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నిత్యవసర సరుకుల ధరలు పెంచుతూ ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీస్తూ గ్రామీణ ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చుతుందని అన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి బిజెపిని నిలువరించాల్సిన తెలుగుదేశం, వైసిపి, జనసేన బలపరచడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి రాజ్యాంగ పరిరక్షణకై, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ఇండియా వేదికలో భాగంగా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి మండంగి రమణను, అరకు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న పాచిపెంట అప్పల నరసకు సుత్తి కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.గంగునాయుడు, అశోక్‌, పి.శంకర రావు, బివి రమణ, కరణం రవీంద్ర, గరుగుబిల్లి శ్రీను, కూరంగి సీతారాం, కాంగ్రెస్‌ నాయకులు బోను శంకర్రావు, ఎం వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సాలూరు : ఇండియా వేదిక సిపిఎం ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని కోరుతూ పట్టణంలో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ నాయకులు కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి మెయిన్‌ రోడ్‌, వెంకటేశ్వరా డీలక్స్‌ సెంటర్‌, గాంధీనగర్‌, నాయుడు వీధి, శివాజీ సెంటర్‌, డబ్బవీధి, కోట వీధుల మీదుగా ర్యాలీ సాగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్వైనాయుడు, ఎం.శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు సిగడాపు బంగారయ్య మాట్లాడుతూ దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచి పెడుతున్న బిజెపి, దాని మిత్ర పక్షాలను ఓడించాలని కోరారు. ప్రజాసమస్యలపై పోరాడే నాయకుడు, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం కషి చేసే నాయకుడు, సిపిఎం ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సీదరపు అప్పారావు, గెమ్మెల జానకీరావు, వంతల సుందరరావు పాల్గొన్నారు.

➡️