మెరుగైన సేవలందించాలి : కమిషనర్‌

Jun 19,2024 21:46

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందే విధంగా చూడాలని కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎంఎం నాయుడు ఆదేశించారు. బుధవారం నగరంలోని పలు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ప్రజా ఫిర్యాదుల నమోదు, రిజిస్టర్ల నిర్వహణ, అందిస్తున్న పౌర సేవలపై ఆరా తీశారు. విధులలో నిర్లక్ష్యంగా ఉన్న కార్యదర్శుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 21, 22 నెంబరు సచివాలయాలను బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను స్వీకరించి నమోదు చేసి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కార్యదర్శులకు ఆదేశించామన్నారు. సచివాలయాల పరిధిలో అనునిత్యం క్షేత్ర పరిశీలనలు చేస్తూ స్థానిక సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజారోగ్య అధికారులకు తెలపాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణకు ప్రజల సహకరించాలన్నారు. వీధులలో కుక్కల సంచారం పట్ల కార్యదర్శులు దృష్టి సారించాలన్నారు. తప్పనిసరిగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌ అయ్యేలా చూడాలన్నారు. అనంతరం ఆచంట గార్డెన్‌ నిర్వహణ పనితీరును ఆయన పరిశీలించారు. 

➡️