ముగిసిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు

రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు

విజేతలకు, వ్యక్తిగత ప్రతిభకు బహమతుల ప్రదానం

ప్రజాశక్తి -అనకాపల్లి : స్థానిక వివి రమణ రైతు భారతి ఆడిటోరియంలో జ్యోతి సరళ స్మారక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఈనెల 17, 18, 19 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ముగిసాయి. ఈ పోటీల్లో ఎంపిక చేసిన నాటక సమాజాలకు చెందిన ఆరు నాటికలను ప్రదర్శించగా, న్యాయ నిర్ణేతలుగా కోరుకొండ శేషగిరిరావు, దండు నాగేశ్వరరావు, వివి రామారావు వ్యవహరించి ఉత్తమ ప్రదర్శన, నటులు, కళాకారులను ఎంపిక చేశారు. విజేతలుగా నిలిచిన నాటక సమాజాలకు, వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన కళాకారులకు దాడి రత్నాకర్‌ జ్ఞాపికలతో పాటు నగదు పురస్కారం అందజేశారు. ఉత్తమ ప్రదర్శనగా మైత్రి కళానిలయం విజయవాడ వారి బంధం నాటిక, ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా కళాభినయ విశాఖపట్నం వారి కాశీవాసి రావయ్య నాటిక, ఉత్తమ తతీయ ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్‌ గుంటూరు వారి అమత హస్తం నాటికలకు బహుమతులు అందజేశారు. అలాగే ఉత్తమ నటిగా బంధం నాటిక నుండి రత్న కుమారికి, ఉత్తమ నటుడుగా నాలోన నీవే నాటిక నుండి రామకృష్ణకు, ఉత్తమ దర్శకులుగా బంధం నాటిక నుండి టీవీ పురుషోత్తంకు, ఉత్తమ రచయితగా నాన్న బంగారు నాటిక రచయిత మూర్తికి వ్యక్తిగత బహుమతులను దాడి రత్నాకర్‌ అందజేశారు. అనంతరం దాడి వీరభద్రరావు 45ఏళ్లక్రితం రచించిన అనగనగా ఒకరాజు నాటిక విశాఖపట్నం కళాకారుల పిసిహెచ్‌ నాయుడు బృందం ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.ఈ సందర్భంగా నాటిక పోటీల ముఖ్య నిర్వహకులు పిసిహెచ్‌ నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో నాటిక పోటీలు జరుగుతున్నా, అనకాపల్లిలో ప్రదర్శనకు వచ్చిన ఆరు నాటక సమాజాల కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి డైమండ్‌ హిట్స్‌ వ్యవస్థాపకులు దాడి వీరభద్రరావు, డైట్‌ కళాశాల కరస్పాండెంట్‌ దాడి రత్నాకర్‌, మున్సిపల్‌ హైస్కూల్‌ పూర్వవిద్యార్థులు, రైతు భారతి ఆడిటోరియం యాజమాన్యం సహకారంతోఈ నాటిక పోటీలు ఏర్పాటు చేశామన్నారు.

➡️