రాజధాని రైతుల్లో అయోమయం

Apr 27,2024 23:23

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని రైతుల్లో అయోమయం ఏర్పడింది. శనివారం సిఎం జగన్‌ విడుదల చేసిన వైసిపి మేనిఫెస్టోలో మరోసారి మూడు రాజధానుల ప్రస్తావన చేశారు. అమరావతిని కేవలం శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు రాకపోతే తమ పరిస్థితి ఏమిటన్న అంశంపై రైతుల్లో తర్జన భర్జనలు ప్రారంభమయ్యాయి. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన పరిస్థితి గందరగోళంలో ఉంది. తాము ఇచ్చిన భూములకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఇంతవరకు దక్కలేదు. కాగితాల్లోనే ఈ ప్లాట్లు ఇచ్చినా అభివృద్ధి చేసి ప్లాట్లు అప్పగించలేదు. సిఆర్‌డిఎ చట్టం ప్రకారం మొదటి మూడేళ్లలోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాల్సి ఉన్నా టిడిపి హయాంలో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగున్నరేళ్లపాటు మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు సుదీర్ఘకాలంపాటు ఉద్యమం నిర్వహించారు. ఈ ఉద్యమంలో అనేక మంది మహిళలు హింసకు గురయ్యారు. రెండుసార్లు పాదయాత్రలు చేశారు. ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల వరకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఉద్యమ తీవ్రతను రైతులు తగ్గించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని స్పష్టం చేశాయి. వైసిపి మాత్రం మూడు రాజధానుల నినాదం కొనసాగిస్తోంది. రైతుల ఉద్యమాన్ని భేఖాతరు చేస్తూ మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ పరిణామం రైతులకు మింగుడుపడటం లేదు. రాజధాని మార్పు వల్ల ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మందగించిందని ప్రజల్లో అసంతృప్తి ఉంది. దీని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గాయి. భూముల ధరలు తగ్గి రైతులు కూడా ఆర్ధిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. లావాదేవీలు మందగించాయి. మేనిఫెస్టోపై పెదవి విరుపులుసిఎం జగన్‌ ప్రకటించిన మేనిఫెస్టోలో కొత్తగా చెప్పుకోదగిన హామీలు లేవు. నవరత్నాల పథకాలల్లో స్వల్ప మార్పులు చేశారు. వైసిపి తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ ప్రస్తుతం ఉన్న పథకాలతోనే స్వల్పమార్పులతో అమలు చేస్తామని ప్రకటించారు. తాము గెలిస్తే పింఛన్లను ఏప్రిల్‌ నుంచి రూ.4 వేలు చేస్తామని టిడిపి ప్రకటించింది. వైసిపి మేనిఫెస్టోలో 2028 వరకు మూడేళ్లపాటు రూ.3 వేలు పింఛను కొనసాగించి చివరి రెండేళ్లురూ.250 చొప్పున 2029 ఎన్నికల నాటికి రూ.3500 చేస్తామని ప్రకటించడంపై వైసిపి కార్యకర్తల్లోనే కొంత నిరాశ కలిగించింది. మరోవైపు మహిళలకు ఆర్‌టిసి బస్సులో ఉచిత ప్రయాణం హామీపి టిడిపి ఇవ్వగా దీన్ని వైసిపి అసలు పట్టించుకోలేదని ఆపార్టీ నుంచే పెదవి విరుపులు వస్తున్నాయి.

➡️