తెనాలిలో పోస్టల్‌ బ్యాలెట్‌ పై గందరగోళం

May 6,2024 12:33 #Confusion, #Postal ballot, #Tenali

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఎన్నికల విధుల్లో పాల్గంటున్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించినప్పటికీ ఫెసిలిటేషన్‌ సెంటర్లలో కనీస సమాచారం లభ్యం కావడం లేదు. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో ఓటరుగా ఉండి వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేస్తూ, మరో జిల్లాలో ఎన్నికల విధులకు కేటాయించిన ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు ఫెలిసిటేషన్‌ సెంటర్‌ కి వస్తే సరైన సమాచారం లేదు. పైగా సవాలక్ష ఆంక్షలు చెబుతున్నారు. హెల్ప్‌ డెస్క్‌ పేరిట ఏర్పాటు చేసిన సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందన్న విషయం కూడా చెప్పలేకపోతున్నారు. మరోవైపు ఇతర జిల్లాలలో ఎన్నికల విధులకు కేటాయించిన వారు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి అనుమతితో మాత్రమే ఓటు వేయాలని చెబుతున్నారు. ఈ ప్రక్రియలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరెడ్డినని కలిసే ప్రయత్నం చేయగా, ఆయన పిఓ, ఎపిఓల శిక్షణా కార్యక్రమం లో బిజీగా ఉన్నారు. డిప్యూటీ తహశీల్దార్‌ హెనిప్రియను సంప్రదిస్తే పోస్టల్‌ బ్యాలెట్‌ పై తనకు అవగాహన లేదని, తహశీల్దార్‌కి ఫోన్‌ చేయాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఫెసిలిటేషన్‌ సెంటర్లకు వచ్చిన సిబ్బంది అయోమయంలో ఉన్నారు.

➡️