వైఎస్‌ఆర్‌నగర్‌లో కార్డాన్‌ సెర్చ్‌

May 26,2024 21:13

ప్రజాశక్తి-విజయనగరం కోట : నగరంలోని వైఎస్‌ఆర్‌ నగర్‌లో టుటౌన్‌ సిఐ కోరాడ రామారావు ఆధ్వర్యాన ఆదివారం కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, రికార్డులు సక్రమంగా లేని వాహనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటి పరిసరాల్లో, వీధుల్లో తనిఖీలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల్ని ప్రశ్నించి, వారు ఎవరింటికి, ఏ పని మీద వచ్చారన్న విషయాలపై ఆరా తీశారు. వాహన రికార్డులు సక్రమంగా లేని 31 మోటారు సైకిళ్లను పోలీసుస్టేషనుకు తరలించారు. వాహన పత్రాలు చూపిన వాహనాల రికార్డులు పరిశీలించి, సక్రమంగా ఉంటే రిలీజ్‌ చేస్తామని సిఐ తెలిపారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్‌ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు దుర్గా ప్రసాద్‌, రాజేష్‌, ఎఎస్‌ఐ పైడితల్లి, తదితరులు పాల్గొన్నారు.

➡️