కార్పొరేట్‌, మతోన్మాద బిజెపిని ఓడించాలి

Apr 8,2024 00:28

మంగళగిరిలో మాట్లాడుతున్న గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌
ప్రజాశక్తి – మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్‌ మతోన్మాద బిజెపిని ఓడించాలని గుంటూరు పార్లమెంటు స్థానానికి ఇండియా ఫోరం తరుపున సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జంగాల అజరుకుమార్‌ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య అధ్యక్షత వహించారు. అజరు కుమార్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను, పెట్రోల్‌ ధరలను భారీగా పెంచిందన్నారు. దేశవ్యాప్తంగా బిజెపికి ఎదురుగాలి వీస్తోందని, అయితే మతాల పేరుతో దేశ ప్రజలను విభజించి రానున్న ఎన్నికల్లో మళ్లీ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఇండియా బ్లాక్‌ అభ్యర్థి జొన్న శివశంకర్‌ మాట్లాడుతూ మంగళగిరి నియోజక వర్గంలో కమ్యూనిస్టులు అనేక పోరాటాలు ప్రజా సమస్య లను పరిష్కరించారని అన్నారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపి పార్టీకి తొత్తు లుగా ఉన్నాయని, ఆ పార్టీలన్నింటినీ ఓడించాలన్నారు. సమావేశంలో సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవు లు, సిపిఐ నియోజవర్గ కార్యదర్శి చిన్ని తిరుప తయ్య, సిపిఎం నాయకులు డి.వెంకట్‌రెడ్డి, పి.బాలకృష్ణ, సిపిఐ నాయకులు కె.మాల్యాద్రి, ఎ.అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, పార్లమెంట్‌కు కమ్యూనిస్టులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడానికి కార్మికవర్గం కృషి చేయాలని సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య కోరారు. ఎయిమ్స్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ విస్తృత సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. చెంగయ్య మాట్లాడుతూ కార్మికవర్గం పోరాటాలకు అండగా ఉండే, కార్మిక హక్కులు, ప్రజా సమస్యలపై చట్ట సభల్లో పోరాడే కమ్యూనిస్టులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ‘ఇండియా’ ఫోరం తరుపున సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకర్‌, గుంటూరు ఎంపీ స్థానానికి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జంగాల అజరు కుమార్‌ను గెలిపించాలని కోరారు. మతోన్మాద బీజేపీని, దానితో జతకట్టిన పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. యూనియన్‌ కార్యదర్శి కె.రమేష్‌ మాట్లాడుతూ పోరాడే అభ్యర్థులకు కార్మికుల అండ ఉంటుందన్నారు. జొన్న శివశంకర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టులను ఎన్నుకోవాలన్నారు. సిఐటియు నాయకులు జి.నాగరాజు, పి.శివశంకర్‌రావు, పి.శేఖర్‌బాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పొన్నూరు రూరల్‌ : సిపిఐ ఆధ్వర్యంలో పొన్నూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నాయకులు ఆరేటి రామారావు ఆధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జంగాల అజరు కుమార్‌తోపాటు ఇండియా ఫోరం తరుపున కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొన్నూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న జక్కా రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు. జంగాల అజరు మాట్లాడుతూ మోడీ రూపంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. మోడీ ఓటమితోనే సామా న్యులకు మనుగడని చెప్పారు. రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలు దేశపు రెండవ స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తితో జరుగుతున్నాయని అన్నారు. నియంతత్వ ప్రభుత్వాల మనుగడ మనుషుల ఉనికికి ప్రమాదమన్నారు. సిపిఐ నాయకులు పి.సత్యనారాయణ, కాంగ్రెస్‌ మండల, పట్టణ అధ్యక్షులు సిహెచ్‌.రవిబాబు, టి.సాంబయ్య, రైతు నాయకులు కె.రంగారెడ్డి, ఎ.అరుణ్‌ కుమార్‌, ఎం.హనుమంతరావు, డి.శ్రీను పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తాడేపల్లి : ఎమ్మెల్యేగా జొన్నా శివశంకరావు, గుంటూరు ఎంపీగా జంగాల అజరుకుమార్‌ను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు కోరారు. తాడేపల్లి ముగ్గురోడ్డు చర్చి సమీపంలో లక్ష్మయ్య కొట్టు వద్ద జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా చోట్ల జరిగిన సమావేశాలకు స్థానిక శాఖ కార్యదర్శి డి.విజయబాబు అధ్యక్షత వహించారు. సూర్యారావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే సిపిఎం వల్లనేనని చెప్పారు. పేదలపై దాడులు, దౌర్జన్యాలు నిలువరించడంలో కమ్యూనిస్టుల కృషి ఉందన్నారు. కేంద్రంలోని మోడీ అధికారంలోకి వస్తే మరోసారి ఎన్నికలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైసిపి, టిడిపి, జనసేన బిజెపికి మద్దతు పలుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. సమావేశాల్లో వై.శ్రీనివాసరావు, కె.మేరి, ఫిరోజ్‌ పాల్గొన్నారు. ప్రకాష్‌నగర్‌ సిఐటియు కార్యాలయంలో ఇపిఎస్‌ పెన్షనర్స్‌ సమావేశం జరిగింది. పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా నాయకులు కొల్లిపర బాబుప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్యం దేశ వ్యాప్తంగా 1.20 కోట్ల మంది పెన్షనర్స్‌ను నమ్మించి మోసం చేసిందని చెప్పారు. కనీస పెన్షన్‌ నెలకు రూ.3500 ఇస్తామని 2014 ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారని, 2019 ఎన్నికల్లో రూ.5 వేలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. నేటీకీ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. రిటైర్‌ అయిన కార్మికులకు ఆశ పెట్టి మోసం చేసిందని, అలాంటి బిజెపి, దానితో పొత్తు పెట్టుకున్న పార్టీలను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కనీస పెన్షన్‌ నెలకు రూ.10 వేలు అమలు చేయాలని, వైద్య సౌకర్యం అమలు చేయాలని కోరారు. ఏసీసీ కార్మికుల నష్టపరిహారం కోసం పోరాడు తున్న సిపిఐటియు, సిపిఎంలకు మద్దతుగా నిలవాలని కోరారు. సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్‌రావును గెలిపిం చాలన్నారు. సిఐటియు జిల్లా నాయకులు వి.దుర్గారావు, ఏసీసీ కార్మిక సంఘం నాయకులు స్టీఫెన్‌ పాల్గొన్నారు.

తాడేపల్లిలో మాట్లాడుతున్న మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు

ప్రజాశక్తి తాడేపల్లి రూరల్‌ : మోడీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని నమ్మ బలికిన నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలుగా మారాయని, బిజెపి పరిపాలనలో నిరుద్యోగం దేశంలోనే రెట్టింపు అయిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. ఆదివారం రాత్రి ప్రాతూరులో సిపిఎం విస్తృత సమావేశం డి.రాజేంద్రబాబు అధ్యక్షతన జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని ప్రైవేటుపరం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించకుండా దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచి పెట్టారని మండిపడ్డారు. కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చారని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజ్యాంగానికి ముప్పు వాటిలిందని అన్నారు. మతోన్మాద శక్తి నుండి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. బిజెపిని గద్దె దించడమే కాకుండా దానితో జగకట్టిన టిడిపి, జనసేన పార్టీలను, నిరంకుశ వైఖరి అవలంబిస్తున్న వైసిపిని ఓడించాలన్నారు. రానున్న ఎన్నికలలో ఇండియా ఫోరం అభ్యర్థులును గెలిపించాలని కోరారు. ఇండియా ఫోరం తరుపున సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జొన్న శివశంకరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని, రైతులను నిర్వీర్యం చేసే మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చిన బిజెపిని రైతులందరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మోడీ విధానాలను వ్యతిరేకించాలని ఆయన అన్నారు. సిఐటియు జిల్లా నాయకులు బి.ముత్యాలరావు మాట్లాడుతూ మోడీ విధానాలను తూచా తప్పకుండా పాటిస్తున్న వైసిపి ప్రభుత్వం కార్మికులపై ఉక్కు పాదం మోపిందన్నారు. మున్సిపల్‌ ఉద్యోగులు, అంగన్వాడి, ఆశా వర్కర్లు సమస్యలను విస్మరించారన్నారు. సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, నాయరకులు పి.కృష్ణ, బి.రాజు, బి.నాగిరెడ్డి, డి.సురేష్‌, పి.సుబ్బారావు పాల్గొన్నారు.

➡️