ప్రజాసమస్యల పరిష్కారమే సిపిఎం లక్ష్యం : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మన్నూరు భాస్కరయ్య

ప్రజాశక్తి-నెల్లూరు : పేద ప్రజల సమస్యల పరిష్కారమే తన ఆశయంగా చేసుకొని సిపిఎం పనిచేస్తుందని, ఈ నేపథ్యంలో చాలా కాలం తరువాత నగర నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూలం రమేష్‌ కు ఓట్లు వేసి అత్యధిక మోజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మన్నూరు.భాస్కరయ్య పిలుపునిచ్చారు. బుధవారం నగర నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్‌ అహ్మద్‌ నగర్‌ తోట, బీసీ నాయుడు వీధి, సత్యనారాయణ పురం, మైపాడు రోడ్డు, తదితర ప్రాంతాల్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … సిపిఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మూలం రమేష్‌ చాలా కాలం నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే తన అజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, ఆన్‌ఆద్మీ, విసికె వంటి అనేక పార్టీలు కలిసిన ఇండియా కుటమిలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ మాట్లాడుతూ … నగరంలో కార్మిక, కర్షక ఉద్యమాలకు తమ పార్టీ శ్రీకారంచుట్టి వారి సమస్యల పరిష్కారానికి కఅషి చేసిందన్నారు. అహ్మద్‌నగర్‌ ప్రాంతంలోని కాలువగట్ల మీద ఉన్న నిరుపేదల నివాసాలు తొలగించే క్రమంలో సిపిఎం అడ్డుకొని న్యాయ స్థానాన్ని ఆశ్రయించి ఇళ్ళ స్థలాలను నిలిపామన్నారు. అదే విధంగా బర్మాషాల్‌ గుంట ప్రాంతంలోని రైల్వే స్థలంలో నిరుపేదల నివాసాలను తొలగించే క్రమంలో సిపిఎం పోరాటం చేసిందన్నారు. ఇళ్లను కోల్పోతున్నవారందరికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపిన అనంతరం ప్రభుత్వం ఇళ్లను తొలగించే విధంగా సిపిఎం పోరాటం చేసిందన్నారు. నగరంలోని మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టిడిపి, వైసిపి ప్రభుత్వ పాలనల్లో నిరంతరం పోరాటాలు చేసి కార్మికుల పక్షాన నిలిచింది సిపిఎం అన్నారు. అంగన్వాడీ, ఆశా, కార్మికుల, కర్షకుల, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చేసే పోరాటంలో సిపిఎం అండగా నిలిచిందన్నారు. మైనార్టీల మీద దాడులు జరిగిన సమయంలో సిపిఎం నిలబడిందన్నారు. ప్రస్తుతం బిజేపి పాలనలో మైనార్టీల, క్రిస్టియన్ల మీద దాడులు పెరుగుతున్నాయన్నారు. ఈ దాడులను అడ్డుకుం టున్న ఏకైక పార్టీ సిపిఎం ఒక్కటేనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి వంత పాడుతున్న వైసిపి, టిడిపి, జనసేనలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సంస్కరణల పేరుతో విద్యుత్తు బిల్లులు పెంపు, ఇంటి పన్ను, కుళాయి పన్ను పెంచేందుకు, చివరకు చెత్త పన్ను విధించేందుకు వైసిపి మద్దతు ఇచ్చిందన్నారు. బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ … తాము అధికారంలోకి వస్తే మైనార్టీలకు సంబంధించి 4 శాతం రిజర్వేషన్‌ను తీసివేస్తామని, తొలగిస్తామని ప్రకటించిందన్నారు. ఈ ప్రకటనను టిడిపి, వైసిపి, జనసేన నాయకులు ఇప్పటి వరకు ఖండించలేదని, వీరందరూ కలిసి బిజెపికి మద్దతునిస్తూ అంగీకారం తెలుపుతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించి మైనార్టీలకు రిజర్వేషన్‌ ఉండాలని, అందుకోసం సిపిఎం పోరాటం చేస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చి దేశంలోని రాజకీయ పరిణామాలను కలుషితం చేసేందుకు కుటిల ప్రయత్నం చేస్తుంటే టిడిపి, వైసిపి వ్యతిరేకించడం లేదన్నారు. ఇలాంటి పార్టీలను ఓడించి అనునిత్యం ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేసే సిపిఎం అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్‌ మస్తాన్‌ బి, కత్తి పద్మ ,నగర కమిటీ సభ్యులు నరసింహ ,చిరంజీవి, మేలు, ప్రజానాట్యమండలి నాయకులు పి వేణు, శాఖ సభ్యులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు

➡️