సామాజిక పింఛనులో కోత!

May 4,2024 23:01

బ్యాంకు వెలుపల విత్‌డ్రా ఫారాలు రాయించుకుంటున్న లబ్ధిదారులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
మూడ్రోజులపాటు ఎండల్లో నానా తిప్పలు పడితే ఈనెల పింఛను చేతిలో పడింది.. తీరా చూస్తే రూ.2 వేలే ఇచ్చారు. ఇదేమిటయ్యా.. అని అడిగితే ఖాతాలో కనీస నిల్వ ఉండాలి. అందుకే రూ.వెయ్యి కట్‌ చేసుకుని ఇచ్చాం.. అని పండరిపురంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచిలో సామాజిక పింఛను తీసుకున్న సుబానీ నగర్‌కు చెందిన 65 ఏళ్లు పైబడిన వృద్ధురాలు వాపోయారు. బ్యాంకు ఖాతాల్లో జమైన పింఛను తీసుకునే వారిలో ఎక్కువ మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని లబ్ధిదారుల్లో 8620 మందికి పింఛను మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేశారు. గురువారం నుండి ఈ డబ్బులు తీసుకోవడానికి లబ్ధిదార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇందుకుగాను తాము ఇప్పటికే ఆటో, రిక్షా ఖర్చులు రూ.వందకుపైగా చేశామని పలువురు చెబుతున్నారు. గ్రామీణులకైతే ఇదింకా రూ.200కు పైగా అయ్యాయి. దీనికితోడు లబ్ధిదార్లంతా దాదాపు నిరక్షరాస్యులు కావడంతో లేదా విత్‌డ్రా అప్లికేషన్‌ రాసుకోలేని వారు. బ్యాంకుల్లో ఇందుకు ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో బయటివారిపై లబ్ధిదార్లు ఆధారపడాల్సి వచ్చింది. దీంతో వారు ఒక్కో ఫారం రాయడానికి రూ.10-20 వసూలు చేశారు. రూ.50 చెల్లించుకున్నవారూ ఉన్నారు. ఈ ఖర్చులన్నీ పోను లబ్ధిదార్లకు చేతికి రూ.1800-2100 మధ్య వస్తున్నట్లు వాపోతున్నారు. విత్‌డ్రా ఫారాల అంశమై యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించగా సిబ్బంది లేని కారణంగా ఓచర్లు రాసేందుకు ఎవర్నీ కేటాయించలేకపోయామని చెప్పారు. అయితే తాగునీరు, టెంట్లు తదితర సదుపాయాలను శుక్రవారం నుండి కల్పించామని చెప్పారు.

➡️