విధుల్లోకి తీసుకోవాలంటూ …వాలంటీర్ల ధర్నా

Jun 21,2024 17:16 #Dharna, #duties, #volunteers

ప్రజాశక్తి-కాకినాడ : తొలగించిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పలు డివిజన్లకు చెందిన పలువురు వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. తమకు రాజీనామా చేయడం చేయడం ఇష్టం లేకున్నా వైసిపి నేతలు, కార్యకర్తలు చెప్పిన మాటలతో తాము రాజీనామా చేసామే తప్ప మనస్ఫూర్తిగా చేయలేదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు చెందిన లీడర్‌ పుట్రేవు అరుణ మాట్లాడుతూ … తాము కోవిడ్‌ సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రజలకు పలు రకాలుగా కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించామన్నారు. అలాంటి తమను వైసిపి కు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని మీరు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడంతో తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు సమర్పించామన్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకుల ఎవరూ కూడా తమకు ధైర్యం చెప్పకపోగా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల పాటు సేవలందించి తమను తిరిగి విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్లను వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. తమకు కుటుంబ పోషణ చాలా కష్టతరంగా మారుతుందని అందువల్ల తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అరుణ ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో అరుణతో పాటు నాగలక్ష్మి, సంధ్య, కామేశ్వరి, జ్యోతి తదితర వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️