ఐదు రోజుల పనికాలం మరో ఏడాది పొడిగింపు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సెక్రటేరియట్‌, హెచ్‌ఓడిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఐదు రోజుల పనిదినాలను మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 27వ తేదీ నుండే ఈ ఉత్తర్వు అమల్లోకి రానుందని పేర్కొంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయాన్ని వెలగపూడి తరలించారు. ఆ సమయంలో ఎక్కువ మంది ఉద్యోగులు తమ కుటుంబాలు హైదరాబాద్‌లో ఉంటున్నాయని, పిల్లలూ అక్కడే చదువుకుంటున్నారని, కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం వారంలో ఐదురోజుల పనిదినాన్ని అమలు చేసింది. సోమవారం నుండి శుక్రవారం వరకే పనిదినాలుగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏడాదీ దీన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. గతేడాది జూన్‌లో దీన్ని ఏడాదికాలం పొడిగించారు. ఈ నెల 30వ తేదీతో గడువు ముగుస్తుండటంతో మరో ఏడాది పొడిగించారు. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు వెంకట్రామిరెడ్డి, రామకృష్ణ, నాపా ప్రసాద్‌, యువి కృష్ణయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

➡️