టిడిపి అరాచకాలపై చర్యలు తీసుకోండి – డిజిపిని కోరిన వైసిపి

Jun 27,2024 21:45 #asked, #DGP, #YCP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 15 రోజుల్లో విధ్వంసమే లక్ష్యంగా వైసిపి కార్యకర్తలపై, వైసిపి కార్యాలయాలపై ఆ పార్టీ కార్యకర్తలు అరాచకాలతో దాడులకు పాల్పడుతున్నారని, తక్షణం వారిపై చర్యలు తీసుకుని వైసిపి కార్యాలయాలకు భద్రత కల్పించాలని వైసిపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు డిజిపి ద్వారకా తిరుమలరావుకు గురువారం వైసిపి ఫిర్యాదు చేసింది. అనంతరం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందునుండే ఈ విధ్వంసాలకు వ్యూహ రచన చేశారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు 14 జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధింపులకు గురిచేయడం తగదని అన్నారు. పోలీస్‌ కస్టడీతో కోర్టుకు వెళ్తున్న పిన్నెల్లిపై టిడిపి కార్యకర్తలు దాడులకు పాల్పడటం అరాచకమని అన్నారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చిందన్న కక్షతో తమ పార్టీ కార్యాలయాలను కూల్చి వేశారని ఆరోపించారు.

➡️