జ్వరాలు అదుపులో ఉండేలా చర్యలు : డిఎంహెచ్‌ఒ

Jun 25,2024 21:33

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం/కురుపాం : సీజనల్‌ జ్వరాలు అదుపులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.విజయపార్వతి అన్నారు. ఈమేరకు ఆమె మంగళవారం కురుపాం, గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి. జగన్మోహనరావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరిండెంట్లతో మాట్లాడి ప్రతిరోజూ జ్వర లక్షణాలతో ఎంతమంది వస్తున్నారు, ఏ విధమైన జ్వరాలుగా గుర్తిస్తున్నారు, వారికి అందజేస్తున్న చికిత్స, ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తున్నారు మొదలగు వివరాలను ఆరాతీశారు. ల్యాబ్‌లను తనిఖీ చేసి జ్వర నిర్ధారణ పరీక్షలు చేస్తున్న తీరును అడిగి, అక్కడ ఉన్న రక్త పూతల స్లైడ్‌లను పరిశీలించారు. మలేరియా జ్వర నిర్ధారణ విషయంలో జాప్యం లేకుండా సకాలంలో పరీక్షలు జరపాలని ఆదేశించారు. ప్రసూతి గది, రక్తనిధి కేంద్రం, వార్డులను తనిఖీ చేసి ప్రతినెలా జరుగుతున్న ప్రసవాల వివరాలను తెలుసుకున్నారు. జ్వరాలు, డయేరియా తదితర సీజనల్‌ వ్యాధులతో వచ్చే రోగులపై ప్రతేక దష్టి సారించాలన్నారు. మొండెంఖల్లు పిహెచ్సి ని తనిఖీ చేసి ల్యాబ్‌,ప్రసూతి గది తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్లు డాక్టర్‌ శోభారాణి, డాక్టర్‌ త్రివేణి, వైద్యాధికారి డాక్టర్‌ హర్ష, ఎఎంఒ సూర్యనారాయణ, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

 

➡️