అధికారం వచ్చేవరకు ఆక్రమణలు గుర్తుకు రాలేదా?

Jun 29,2024 20:09

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : రాజకీయం అంటే అధికారంలోవున్నా లేకున్నా ప్రజల తరపున పోరాడేది. ఇంకా చెప్పాలంటే ప్రజలకు సేవచేసేది. అలాగని పార్లమెంటరీ రాజకీయాలు అవసరం లేదని కాదు. కానీ, ప్రజాసమస్యల పట్ల స్పందించేందుకు, పాలకుల దోపిడీని నిలువరించేందుకు కేవలం అధికారం మాత్రమే ఉండాలనుకుంటే పొరపాటే. ఈ మాటకొస్తే రాజకీయాల్లోని లేనివారు కూడా చర్చకు వచ్చే అంశాలపై తమ వైఖరి కుండబద్ధలు కొట్టినట్టు తెలియజేస్తారు. వైసిపి కార్యాలయం వివాదం విషయంలో విజయనగరం ఎమ్మెల్యే, ఆమె ఆనుయాయులు, ఆ పార్టీ నాయకుల వైఖరి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. వైసిపి అధికారంలోవున్నప్పుడే విజయనగరం రింగురోడ్డుకు ఆనుకుని దాసన్నపేటలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా టిడిపి అధికారంలోకి రావడంతో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆ కార్యాలయాన్ని సందర్శించి వైసిపిపై కీలక ఆరోపణలు చేశారు. అదితి వెంట జనసేన, బిజెపి నాయకులు కూడా ఉన్నారు. కార్యాలయ భవనం కోసం భూములు కబ్జాచేశారని, అనుమతులు కూడా తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారని అదితి చేసిన విమర్శ. ఇంతవరకు బాగానే ఉన్నా…. అసలు జిల్లా కేంద్రంలో హాట్‌కేక్‌ లాంటి రింగురోడ్డులో ఏకంగా మాన్సాస్‌ భూమి ఆక్రమించుకుంటే ఇన్నాళ్లు టిడిపి ఏమైపోయింది. ఎందుకు అడగలేదు. అందులోనూ మాన్సాస్‌ అంటే ఎమ్మెల్యే వారసత్వ ట్రస్ట్‌. అయినా సరే ఎందుకు నోరు మెదపలేదు? వైసిపి అధికారంలో ఉండడం వల్ల భయపడ్డారా? అప్పట్లో మనకెందుకు లే అనుకుంటూ రాజీపడ్డారా? అలాంటప్పుడెందుకు అంత ఉలుకుపాటు? ఇదీ అక్షరాలా జనం నోట వినిపిస్తున్న ప్రశ్నలు. ఇందుకు టిడిపి నాయకులు, ఎమ్మెల్యే అదితి సమాధానం చెప్పాలివుంది. నిజంగా టిడిపికి చిత్తశుద్ది ఉంటే భూమిని కబ్జాచేసిన వారిపైనా, అధికార దుర్వినియోగానికి పాల్పడినవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అందుకు టిడిపి సాహసిస్తుందా? జనం నుంచి వినిపిస్తున్న ధర్మ సందేహమిది. వాస్తవానికి వైసిపి అక్రమాలు నిజంగా బయటపెట్టి బోనులో నిలబెట్టాలనుకుంటే జగనన్న కాలనీలపేరిట సేకరించిన భూ వ్యవహారాలు పరిశీలిస్తే బోలెడన్ని అక్రమాలు బయటపడతాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే విజయనగరంలోనే అనేక చెరువులు మాయమయ్యాయి. ఇంకా చెప్పాలంటే దళితుల లబ్ధిపేరిట రెగ్యులైజేషన్‌కు వైసిపి ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌ ఓ భూదందా. ఫ్రీహోల్డ్‌ చేసిన భూములన్నీ వైసిపి నాయకుల చేతుల్లోకి వెళ్లాయి. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో అయితే ఏకంగా వైసిపికి చెందిన బడా నాయకులే అడ్వాన్సులు ఇచ్చి వశపర్చుకున్నారు. ఇవన్నీ బయటకు తీసి, ఆక్రమార్కుల చిట్టా బయటపెట్టి, అమాయక దళితులకు అండగా నిలబడేంత చిత్తశుద్ధి ఉందా? అన్నది పబ్లిక్‌ టాక్‌. ఇవేవీ చేయకుండా ఊరకే వైసిపిపై ఆరోపణలతో కాలక్షేపం చేస్తే ప్రజావిశ్వాసాన్ని కోల్పోవడం తప్ప టిడిపికి కలిసొచ్చే అవకాశమేమీ లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో వైసిపి రాష్ట్ర నాయకుడు విజయసాయిరెడ్డి, జిల్లాకు చెందిన అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మాన్సాస్‌ లెక్కలు తేలుస్తామంటూ తుస్సుమనిపించారు. టిడిపి కూడా అటువంటి హడావుడే చేస్తోందని, ఇరు పార్టీలో ఓ స్పష్టమైన అవగాహనతోనే పరస్పర ఆరోపణలు చేసుకోవడం పరిపాటేనని జనం చర్చించు కుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే అదితిచేసిన ఆరోపణలు రుజువని నిరూపించి చర్యలు తీసుకునేవరకు వెళ్లకపోతే ప్రజల్లో చులకనైపోయే ప్రమాదం లేకపోలేదని సాక్షాత్తు టిడిపి నాయకుల నోటే వినిపిస్తోంది.

➡️