పొరపాట్లకు తావివ్వొద్దు

May 2,2024 21:21

ప్రజాశక్తి-చీపురుపల్లి : ఈనెల 13న జరిగే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్‌ నిర్వహించాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదేశించారు. పోలింగ్‌ నిర్వహణకు సంబంధించి పిఒలు, ఎపిఒలు పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాల్సి వుందన్నారు. ఎలాంటి సందేహాలు వున్నా శిక్షణలో నివత్తి చేసుకోవాలని సూచించారు. పిఒ, ఎపిఒల రెండో విడత శిక్షణ కార్యక్రమాలు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం చేపట్టారు. రాజాం, చీపురుపల్లిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని గరివిడి ఎస్‌డిఎస్‌ అటానమస్‌ కళాశాలలో జరిగిన చీపురుపల్లి నియోజకవర్గ ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో సూచించారు. ఇవిఎంల్లో ఏమైనా లోపాలుంటే మాక్‌ పోల్‌ సమయంలోనే తెలిసిపోతుం దన్నారు. పిఒలు డైరీ, 17సి సక్రమంగా నింపి అందజేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకు నేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటు హక్కు కలిగివున్న సిబ్బంది తమకు ఏ నియోజకవర్గంలో ఓటు వుంటే ఆ నియోజకవర్గ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయొచ్చన్నారు. ఇతర జిల్లాల్లో ఓటు కలిగివున్న వారు జిల్లా కేంద్రంలోని జెఎన్‌టియులో తమ ఓటు వేయాల్సి వుంటుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై కూడా సిబ్బందికి అవగాహన కల్పించాల్సి వుందన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌లు, హోమ్‌ ఓటింగ్‌ కోసం చేస్తున్న ఏర్పాట్లపై రిటర్నింగ్‌ అధికారి, ఆర్‌డిఒ. బి.శాంతిని అడిగి తెలుసుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం సిద్దం చేసిన బాక్సులు, పోలింగ్‌ నిర్వహణకోసం పంపిణీకి సిద్ధం చేసిన సామాగ్రిని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ పర్యటనలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల తహశీల్దార్‌లు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురంరూరల్‌: సాధారణ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు నియమించిన సూక్ష్మ పరిశీలకుల శిక్షణ ర్యాండమైజేషన్‌ గురువారం పూర్తి చేశారు. కలెక్టరేట్‌లో పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ మెహార్థ సమక్షంలో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సమక్షంలో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా సూక్ష్మ పరిశీలకులకు అవసరమైన శిక్షణా తరగతులను కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించనున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఈ నెల 8న ఉదయం 10నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు రెండు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సాధారణ పరిశీలకులకు కలెక్టర్‌ వివరించారు.

➡️