తడిసి ముద్దయిన తూనికాకు

May 19,2024 23:18 #తూనికాకు
తూనికాకు

అకాల వర్షానికి కళ్లాల్లో నీటమునిగిన కట్టలు

నాణ్యత చెడిపోవడమే కాక నష్టం వస్తుందని ఆందోళన

ప్రజాశక్తి-చింతూరు : గత రాత్రి కురిసిన భారీవర్షానికి చింతూరు మన్యంలోని పలు కళ్లాల్లో ఆరబెట్టిన తూనికాకు కట్టలు తడిసి ముద్దవ్వడంతోపాటు, వర్షపునీటిలో మునిగిపోయాయి. నాణ్యమైన బీడీ ఆకులకు నెలవుగా ప్రసిద్ధి చెందిన చింతూరు ఏజెన్సీలో అకాల వర్షానికి రూ. లక్షల విలువ చేసే తూనికాకు కట్టలుగా తడిసి పోవడంతోపాటు వర్షపునీటిలో మునిగి ఉండడంతో వాటిపై మచ్చలు ఏర్పడిన నాణ్యత చెడుతుందని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు.కాగా బీడీ ఆకుల కళ్లాలను ఎత్తయిన, ఏటవాలు ప్రదేశాల్లో ఎంతటి వర్షం వచ్చినా నీటి నిల్వ ఉండని ప్రాంతాల్లో ఏర్పాటు చేయకుండా, లోతట్టు ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు. ఎక్కడ వర్షపునీరు అక్కడే నిలిచిపోవడంతో నేలపైనే ఆరబెట్టిన తూనికాకు కట్టలన్నీ మట్టి పట్టడంతోపాటు ఉదయానికి కూడా వర్షపునీటిలో మునిగి ఉన్నాయని అంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు లేకుండా కళ్లాలను ఏర్పాటు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మండలంలోని. కల్లేరు, మధుగురు, సూరన్న గొంది, గూడూరు తదితర గ్రామాల్లోని తూనికాకు కళ్లాల్లో బీడిఆకుల కట్టలన్నీ నీట మునిగి ఉండడంతో వాటన్నింటినీ ఏరి, కట్టల్లోని నీరు పోయేలా చేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అడ్డదారిలో ఒడిశాకు.. ఆంధ్రా ఆదాయానికి గండి

ఆంధ్రాలో తూనికాకు కట్టల ధర, ఒడిశా కంటే తక్కువగా ఉండడంతో తూనికాకును సేకరించిన స్థానికులు వాటిని సరిహద్దు దాటించి, ఒడిశాలో విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో 50 ఆకుల తూనికాకు కట్టకు రూ.4లు చెల్లిస్తుండగా, అదే కట్టకు ఒడిశాలో రూ.ఐదు చెల్లిస్తున్నారు. దీంతో చింతూరు మన్యంలో తూనికాకు సేకరణకు కళ్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, స్థానికులు తాము సేకరించిన తూనికాకులను ఆంధ్రాలో కాకుండా, సీలేరు నదిని దాటించి ఒడిశాలోని మోటు పంచాయతీకి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అంతేకాక అక్కడ తక్షణమే డబ్బులు చెల్లిస్తుండడంతో ఎక్కువమంది తూనికాకు సేకరణదారులు సరిహద్దును దాటించేస్తున్నారు. దీంతో ఒడిశాలో తూనికాకు సేకరణ ద్వారా కోట్లలో వ్యాపారం జరుగుతుండగా, చింతూరు ఏజెన్సీలో లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. తూనికాకు ధరను పెంచడంతోపాటు, చింతూరు మన్యంలోని తూనికాకులు ఒడిశా తరలిపోకుండా అడ్డుకోవడంలో అటవీ, ఇతర శాఖల వైఫల్యమే దీనికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

➡️