డిఎస్‌సిలో ఉపాధ్యాయ పోస్టులు పెంచాలి : డివైఎఫ్‌ఐ

Jun 30,2024 21:34

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : రాష్ట్రంలో డిఎస్‌సి ద్వారా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను పెంచాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షులు వై.రాము డిమాండ్‌ చేశారు. డివైఎఫ్‌ఐ కార్యకర్తల సమావేశం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్‌పి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్‌జిటి సంఖ్య తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, ఉమ్మడి జిల్లా నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో సుమారు 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గతప్రభుత్వం మూసివేసిన పాఠశాలలను తెరిపిస్తే ఈ పోస్టుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. గత ఏడేళ్లగా డిఎస్‌సి లేనందున వయోపరిమితిని 47సంవత్స రాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏడాది 2కోట్ల ఉద్యోగాలు పేరిట మోసం చేశారని అన్నారు. సమావేశంలో జిల్లాలోని నూతన కన్వినింగ్‌ కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌గా సిహెచ్‌ హరీష్‌, కో-కన్వీనర్‌గా బి.సతీష్‌, టి.నాయుడు, ఎం.గణేష్‌, సభ్యులుగా తిరుపతి,జయరాం, చంద్రశేఖర్‌ ఎన్నికయ్యారు.

➡️